ఖగోళ అద్భుతం: ఏడాది పొడవునా ఒకే సమయానికి తీసిన సూర్యుడి ఫోటోలు వైరల్

by Malleboina Mahesh |

ఏడాది పొడవునా ఒకే సమయానికి తీసిన సూర్యుడి ఫోటోల కలయిక.. ఆకాశంలో ఇంగ్లీష్ అంకె '8' ఆకారాన్ని ఆవిష్కరించిన ఖగోళ అద్భుతం 'అనలెమ్మా'!

ఖగోళ అద్భుతం: ఏడాది పొడవునా ఒకే సమయానికి తీసిన సూర్యుడి ఫోటోలు వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: అంతరిక్షంలో భూమి భ్రమణం, సూర్యుడి చుట్టూ తిరిగే పరిభ్రమణ వేగం మానవ మేధస్సుకు ఎల్లప్పుడూ ఒక అంతుచిక్కని అద్భుతమే. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక అరుదైన వీడియో ఖగోళ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఒక ఫోటోగ్రాఫర్ అపరిమితమైన ఓపికతో, మూడేళ్ల పాటు ఒకే ప్రదేశం నుంచి, ప్రతిరోజూ ఖచ్చితంగా ఒకే సమయానికి ఆకాశంలో ఉన్న సూర్యుడిని ఫోటోలు తీశాడు. ఆ తర్వాత, ఏడాది పొడవునా సూర్యుడు కదిలిన మార్గాన్ని చూపిస్తూ ఆ చిత్రాలన్నింటినీ డిజిటల్ పద్ధతిలో ఒకే ఫ్రేమ్‌గా మార్చగా.. ఆకాశంలో సూర్యుడు ఇంగ్లీష్ అంకె '8' ఆకారంలో (లేదా ఇన్‌ఫినిటీ గుర్తు - ∞) ప్రత్యక్షమయ్యాడు. ఖగోళ శాస్త్రంలో ఈ అద్భుతమైన దృగ్విషయాన్ని "అనలెమ్మా" (Analemma) అని పిలుస్తారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సూర్యుడు ఆకాశంలో ఇలా '8' ఆకారంలో మార్గాన్ని ఏర్పరచడం వెనుక మన భూమి కదలికలకు సంబంధించిన రెండు బలమైన శాస్త్రీయ కారణాలు దాగి ఉన్నాయి. మొదటిది.. భూమి తన కక్ష్యకు దాదాపు 23.5 డిగ్రీల కోణంలో వంగి (Axial Tilt) ఉండటం. దీనివల్ల ఏడాది పొడవునా సూర్యుడు ఆకాశంలో కొద్దిగా పైకి (వేసవిలో), కొద్దిగా కిందికి (శీతాకాలంలో) జరుగుతున్నట్లు కనిపిస్తాడు. రెండవది.. భూమి సూర్యుడి చుట్టూ ఖచ్చితమైన గుండ్రటి ఆకారంలో కాకుండా, దీర్ఘవృత్తాకార (Elliptical) కక్ష్యలో ప్రయాణించడం. దీనివల్ల భూమి వేగంలో వచ్చే హెచ్చుతగ్గుల కారణంగా సూర్యుడు ఆకాశంలో కొద్దిగా ఎడమవైపునకు, కుడివైపునకు జరిగినట్లు కనిపిస్తాడు. ఈ రెండింటి కలయిక వల్లే సూర్యుడు ఈ అద్భుత ఆకృతిని సృష్టిస్తాడని నిపుణులు చెబుతున్నారు. కాగా ఈ వైరల్ మీడియోలోని.. ఒకే స్థానంలో నిలబడి సమయాన్ని, ప్రకృతిని బంధిస్తే ఎంతటి అద్భుతాలు ఆవిష్కృతమవుతాయో చెప్పడానికి ఈ 'అనలెమ్మా' చిత్రమే ఒక నిదర్శనంగా నిలిచింది.

Next Story