చేనేతకు కొత్త రంగులద్దుతోన్న సోషల్ మీడియా..

by  |
చేనేతకు కొత్త రంగులద్దుతోన్న సోషల్ మీడియా..
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా కారణంగా ఇబ్బందుల పాలైన చేనేత రంగం క్రమక్రమంగా కోలుకుంటోంది. కొందరు యువకులు త్రిఫ్ట్ ఫండ్ సహకారంతో, నూతన శైలితో ఆన్ లైన్ వ్యాపారం చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. నిజానికి వస్త్రరంగం లాక్ డౌన్ తో నష్టాల పాలైంది. కోలుకుంటుందో లేదోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. వస్త్ర ప్రపంచమంతా నేటికీ దిగాలుగానే కనిపిస్తోంది. బడా బడా షోరూములు బోసిపోయి కనిపిస్తున్నాయి. ఆర్భాటంగా వేడుకలు చేసేందుకు జనం ఆసక్తిగా లేరు. దాంతో వస్త్ర వ్యాపారులు తీవ్ర నష్టాలను చవి చూస్తున్నారు. పట్టు చీరల అమ్మకాలు 50 శాతానికి పడిపోయాయి. రూ.లక్షల విలువజేసే చీరలకు మార్కెట్ లేకుండాపోయింది. ఆర్డర్లు లేకపోవడంతో చీరలను నేయించడం లేదు. కొందరు మాస్టర్ వీవర్లు ఖరీదైన చీరల ఉత్పత్తి నుంచి తప్పుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన చేనేత కళాకారులు కూడా తప్పుకుంటున్నారు. మార్కెటింగ్ కావడం లేదని చేతులెత్తేశారు. దీంతో కార్మికులే త్రిఫ్టు ఫండ్ నిధులతో మాస్టర్ వీవర్లుగా అవతారమెత్తారు. రూ.20 వేల లోపు విలువైన చీరల ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. రూ. కోట్లు వెచ్చించి షోరూంలు నెలకొల్పిన వ్యాపారులు మార్కెటింగ్ లో విఫలమయ్యారు. చేనేత యువత మాత్రం మార్కెటింగ్ ను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. పెట్టుబడి లేకుండా వ్యాపారాలను మొదలు పెట్టారు. కేవలం సామాజిక మాధ్యమాలలోనే ప్రచారం చేస్తున్నారు. నల్లగొండ, యాదాద్రి, రంగారెడ్డి జిల్లాలకు చెందిన యువత ఆన్ లైన్ వ్యాపారానికి తెర తీశారు. ఒక్క భూదాన్ పోచంపల్లిలోనే 200 మంది ఈ వ్యాపారం చేస్తున్నారు.

ఈజీ మార్కెటింగ్..

పెద్ద సేట్లు మార్కెటింగ్ కష్టమని నిర్ధారించడంతో మగ్గం నిలిచిపోతుందని భయపడ్డారు. కానీ, యువత పట్టుదలతో చేనేత చీరలకు ఎన్నటికీ ఆదరణ తగ్గదని స్పష్టమవుతోంది. పట్టు చీరల వినియోగదారుల నంబర్లను సేకరించి వారు వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేస్తున్నారు. వినియోగదారుల జాబితా పెద్దగానే ఉంది. చీరల ఫోటోలను అందంగా తీసి పోస్టు చేస్తున్నారు. వాటి ప్రత్యేకతను వివరిస్తున్నారు. అక్కడే ధరలను పేర్కొంటున్నారు. దాంతో వినియోగదారులు తమకు నచ్చిన కలర్స్, డిజైన్లను ఎంపిక చేసుకుంటున్నారు. అవసరమైతే వీడియో కాల్ ద్వారా చీర మొత్తాన్ని వీక్షిస్తున్నారు. అదే క్రమంలో ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం, ట్విట్టర్ లోనూ అనుసరిస్తున్నారు. ఒక్కొక్క ఎంటర్ప్రెన్యూర్ కు వేలాది మంది వినియోగదారులు లభించారు. దాంతో భూదాన్ పోచంపల్లిలో ప్రఖ్యాతిగాంచిన ఇక్కత్ చీరలకు ఆన్ లైన్ లో విస్తృతమైన మార్కెటింగ్ లభిస్తోంది. మగ్గం మీద ఉండగానే ఫోటోలు తీసుకొని వినియోగదారులకు చూపిస్తున్నారు. ముందుగానే చీరలను ఉత్పత్తి చేసేవారితో ఎంటర్ప్రెన్యూర్లు ధరలు మాట్లాడుకుంటున్నారు. ప్రతి చీర మీద రూ.500 వరకు లాభాన్ని చూసుకొని ఆన్ లైన్ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. వీళ్లలో బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, పీజీ చేసిన వాళ్లున్నారు. విద్యార్ధులు కూడా ఉన్నారు. ఆన్ లైన్ లోనే వినియోగదారులకు చీరలు, వస్త్రాలను అందిస్తుండడంతో మధ్యవర్తిత్వం తగ్గింది. 30 శాతం వరకు ధరలు తగ్గాయి. అంతకు ముందు రూ.20 వేలకు కొనుగోలు చేసిన చీరలు రూ.15 వేలకే లభిస్తుందని వినియోగదారులు గుర్తించారు. అమెరికా, యూకేల నుంచి కూడా ఇక్కత్ చీరలకు ఆర్డర్లు వస్తున్నట్లు ఎంటర్ప్రెన్యూర్లు చెబుతున్నారు. మొన్నటి వరకు చౌటుప్పల్ దగ్గర ఎల్లంకిలో కాటన్ వస్త్రం హోల్ సేల్ గా మీటరు రూ.105 వరకు ఇచ్చేవాళ్లు. ఇప్పుడదే వస్త్రం రూ.86 లభిస్తోంది. లాక్ డౌన్ ముందు కొనుగోలు చేసినవారు ప్రస్తుత ధరలు చూసి అవాక్కవుతున్నారు.

మరో పదేండ్లు ఢోకా లేదు..

కరోనా, లాక్ డౌన్ వంటివి ఎన్ని వచ్చినా చేనేత రంగానికి ఢోకా లేదు. మరో పదేండ్లు ఉంటుంది. ఇప్పుడు పెద్ద పెద్ద షావుకార్లు చీరల వ్యాపారం నుంచి తప్పుకున్నారు. చేనేత కార్మికులే మాస్టర్ వీవర్లుగా మారారు. త్రిఫ్టు ఫండ్ తో సొంతంగా చీరలు తయారు చేస్తున్నారు. వాటిని మార్కెటింగ్ చేసుకోవడానికి కొత్తగా ఎంటర్ప్రెన్యూర్లు వచ్చారు. యువత మార్కెటింగ్ లో సక్సెస్ అవుతున్నారు. పెద్ద పెద్ద షోరూంల్లోకి వినియోగదారులెవరూ వెళ్లడం లేదు. కరోనా భయంతో పాటు ధరలను చూసి భయపడుతున్నారు. సోషల్ మీడియా ప్రచారంతో అసలైన ధరలు తెలుస్తున్నాయి. కనీసం 30 శాతం తక్కువకే వస్త్రాలు దొరుకుతున్నాయి. పైగా ఇంటికే డెలివరీ చేస్తున్నారు. షాపుల కంటే అత్యధిక సంఖ్యలో ఆన్ లైన్ లో డిజైన్లను చూస్తున్నారు.

–యర్రమాద వెంకన్ననేత, జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త

నెలకు 50 చీరలు అమ్ముతున్నా..

రెండేండ్ల నుంచి ఆన్ లైన్ బిజినెస్ చేస్తున్నా. వాట్సాప్ లోనే వినియోగదారులకు చీరల ఫోటోలను పంపిస్తా. వాళ్లు ఎంపిక చేసుకొని చెప్తే డోర్ డెలివరీ చేయడం లేదంటే కొరియర్ లో పంపిస్తున్నాం. ఆన్ లైన్ లో షాపింగ్ చేయడంతో వినియోగదారులకు మేలు కలుగుతోంది. మా దగ్గర రూ.6 వేల నుంచి రూ.15 వేల ఖరీదు చేసే చీరలు ఉన్నాయి. ముందుగానే వీవర్ల దగ్గర మాట్లాడుకుంటాం. ఆ తర్వాతే సోషల్ మీడియాలో పోస్టు చేస్తాం. చాలా మంది పాత కస్టమర్లు ఉన్నారు. నెలకు 50 చీరల వరకు అమ్మగలుగుతున్నా. నేను డిప్లొమా చేశా. ఈ వ్యాపారం బాగుంది.

–గోషిక పవన్, భూదాన్ పోచంపల్లి, యాదాద్రి జిల్లా

కరోనాతో కొంత తగ్గింది..

వాట్సాప్, ఇన్ స్టాగ్రాంలో పోస్టు చేయడం ద్వారా వినియోగదారులను ఆకట్టుకోగలుగుతున్నాం. కరోనాతో కొంత తగ్గింది. కొందరు ఫోటోలు చూసి నచ్చిన తర్వాత వీడియో కాల్స్ చేస్తున్నారు. దాని ద్వారా చీర మొత్తాన్ని వీక్షిస్తున్నారు. అప్పుడే కొనుగోలు చేస్తున్నారు. వీవర్ల, మాస్టర్ వీవర్ల దగ్గర మేం ముందుగానే కొనుగోలు చేస్తున్నాం. చీరకు రూ.500 మాత్రమే లాభం చూసుకుంటున్నాం. మా దగ్గర ఇక్కత్ చీరలు రూ.6500 నుంచి రూ.20 వేల వరకు ఉన్నాయి. నేను డిగ్రీ వరకు చదివాను. ఇక ఆన్ లైన్ బిజినెస్ బాగుంది.

– కర్నాటి భాను, భూదాన్ పోచంపల్లి, యాదాద్రి జిల్లా

ఒకసారి తీసుకెళ్లిన వారే..

వాట్సాప్, ఇన్ స్టాగ్రాం, ఫేస్ బుక్ లో పోస్టు చేస్తున్నాం. నేను డిగ్రీ చదువుతున్నా. చదువుకుంటూనే ఆన్ లైన్ వ్యాపారాన్ని చేస్తున్న. మా నాన్న కూడా మాస్టర్ వీవర్. ఇప్పుడు మగ్గాల సంఖ్య తగ్గింది. కరోనా ఎఫెక్ట్ ఏమీ లేదు. మా దగ్గర కొనుగోలు చేస్తున్నారు. ఇంట్లో కూడా షాప్ ఉంది. కస్టమర్లకు ఎక్కువ డిజైన్లు చూపిస్తున్నాం. ఒక్కసారి తీసుకెళ్లినవారే మళ్లీ మళ్లీ వస్తారు. వారి పరిచయాలతో ఇంకొందరు ఆన్ లైన్ లోకి వచ్చేస్తున్నారు.

–ఆడెపు సాయి, భూదాన్ పోచంపల్లి, యాదాద్రి జిల్లా


Next Story

Most Viewed