ఆమె చనిపోలేదు.. భార్యను చంపినట్టే బిడ్డను చంపేశాడు సార్(వీడియో)

113

దిశ, సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పదోతరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ బాలిక బంధువులు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. ఎల్లారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అక్షిత (14) పదోతరగతి చదువుతోంది. కాగా గురువారం అక్షిత అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా వెంకటాపూర్ గ్రామంలో బాలిక అమ్మమ్మ, కుటుంబీకులు అడ్డుకున్నారు. బాలిక మృతిపై వారు అనుమానాలు వ్యక్తం చేశారు.

అక్షితను తండ్రి మల్లేశం, బాబాయ్ కనకయ్యలు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ ఆరోపించారు. అక్షిత తల్లి గతంలో ఇదే రీతిలో చనిపోగా తండ్రి మల్లేశం రెండో పెళ్లి చేసుకున్నట్లు బాలిక కుటుంబీకులు తెలిపారు. అక్షిత తండ్రి తన మొదటి భార్యను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని.. ఇప్పుడు కూడా కూతురు అక్షితను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడంటూ సిరిసిల్ల-కామారెడ్డి ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వెంటనే విచారణ చేపట్టి బాలిక మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాలిక ఆత్మహత్యపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..