బాలల అక్రమ రవాణాపై ‘సుప్రీం’ ఆందోళన..కేంద్రానికి నోటీసులు

by velandi.Saikiran |

మానవ అక్రమ రవాణా వేగంగా విస్తరిస్తోందని, చిన్న పిల్లలను కేవలం అమ్మకపు వస్తువులుగా మారుస్తున్నారని వచ్చిన ఓ నివేదికపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

బాలల అక్రమ రవాణాపై ‘సుప్రీం’ ఆందోళన..కేంద్రానికి నోటీసులు
X

దిశ, నేషనల్ బ్యూరో : భారతదేశంలో మానవ అక్రమ రవాణా అత్యంత భయంకరమైన రూపంలో వేగంగా విస్తరిస్తోందని, చిన్న పిల్లలను కేవలం అమ్మకపు వస్తువులుగా మారుస్తున్నారని వచ్చిన ఓ నివేదికపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అసిస్టెంట్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (ఏఆర్టీ) మరియు సరోగసీ కేంద్రాల నియంత్రణ చట్టాలలో ఉన్న లోపాలను ఆసరాగా చేసుకుని, పిల్లల అక్రమ రవాణాకు కొత్త నెట్‌వర్క్‌లు ఏర్పడుతున్నాయని సీనియర్ న్యాయవాది, అమిగస్ క్యూరీ అపర్ణా భట్ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేశారు. దేశంలో కఠినమైన శిక్షాస్మృతి చట్టాలు అమలులో ఉన్నప్పటికీ, అక్రమ రవాణా నుండి పిల్లలను రక్షించడంలో ప్రస్తుత వ్యవస్థ విఫలమవుతోందని ఆమె తెలిపారు.

ఏఆర్టీ, సరోగసీ కేంద్రాల ద్వారా జరిగే పిల్లల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ఎలాంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎన్ఓపి) అందుబాటులో లేదని ఆమె ఎత్తిచూపారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) 2024 నివేదిక ప్రకారం దేశంలో 6,000 కంటే ఎక్కువ అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయని, తప్పిపోయిన పిల్లల సంఖ్యలో 7.8 శాతం పెరుగుదల కనిపించిందని తెలిపారు. 2024లో 98,375 మంది పిల్లలు తప్పిపోగా, ఇప్పటివరకు అసలు జాడ తెలియకుండా పోయిన పిల్లల మొత్తం సంఖ్య 1,47,175 కు చేరుకుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించాలని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కే విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం అదనపు సొలిసిటర్ జనరల్ అర్చనా దేవే పాఠక్‌ను ఆదేశించింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 19 లోగా సమాధానం ఇవ్వాలని కోర్టు గడువు విధించింది.

Next Story