Chess : నార్వే చెస్ చాంపియన్‌గా ప్రజ్ఞానంద

by Harish |

Chess : నార్వే చెస్ చాంపియన్‌గా ప్రజ్ఞానంద
X

దిశ, స్పోర్ట్స్ : భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద ప్రతిష్టాత్మిక టోర్నీ నార్వే చెస్ చాంపియన్‌గా అవతరించాడు. శనివారం జరిగిన ఆఖరిదైన 10వ రౌండ్‌లో జర్మనీ గ్రాండ్‌మాస్టర్ విన్సెంట్ కీమర్‌పై గెలిచి టైటిల్ కైవసం చేసుకున్నాడు. ప్రజ్ఞా నార్వే చెస్ టోర్నీ విజేతగా నిలవడం ఇదే తొలిసారి. ఎంతో ఆసక్తికరంగా సాగిన చివరి రౌండ్‌లో ప్రజ్ఞా తెల్లపావులతో ఆడాడు. 45 ఎత్తుల్లో అతను విన్సెంట్ కీమర్‌ను ఓడించాడు. ఈ విజయంతో అతను 18 పాయింట్లతో నిలిచి టైటిల్ సొంతం చేసుకున్నాడు. అయితే, చివరి రౌండ్ పూర్తయ్యే వరకు కూడా విజేత ఎవరో తేలలేదు. ఈ గేముకు ముందు 9వ రౌండ్‌లో మరో భారత గ్రాండ్‌మాస్టర్, వరల్డ్ చాంపియన్ డి.గుకేశ్‌పై ప్రజ్ఞా విజయం సాధించాడు. అప్పుడు ప్రజ్ఞా 15 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. అమెరికాకు చెందిన వెస్లీ సో 15.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో తప్పక గెలవాల్సిన 10వ రౌండ్‌లో ప్రజ్ఞా సత్తాచాటాడు. మరో గేములో వెస్లీ సో డ్రా చేసుకోవడంతో ప్రజ్ఞా విజయం ఖాయమైంది. వెస్లీ సో 17 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. వరల్డ్ నం.1 మాగ్నస్ కార్ల్‌సెన్ 13 పాయింట్లతో 4వ స్థానంతో సరిపెట్టగా.. గుకేశ్(8.0) 6వ స్థానంలో నిలిచాడు.


Next Story