మంత్రి ఎర్రబెల్లి ఇలాఖాలో రియ‌ల్ దందా..

by  |
land
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్/ తొర్రూరు : మ‌హ‌బూబాబాద్ జిల్లా తొర్రూరు ప‌ట్టణ శివారులో రియ‌ల్ దందా సాగుతోంది. లే అవుట్ అనుమ‌తుల్లేకుండానే ప‌దుల సంఖ్యలో వెంచ‌ర్లు పుట్టుకొస్తున్నాయి. పొలాల‌ను ప్లాట్లుగా చెప్పి అమాయ‌క జ‌నాల‌కు అంట‌గ‌డుతున్నారు. ఈ విష‌యం తెలిసినా మునిసిప‌ల్ అధికారులు చ‌ర్యలు తీసుకోక‌పోవ‌డంపై విమ‌ర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తొర్రూరు 20 వెంచ‌ర్లకు పైగా న‌డుస్తున్నట్లు స‌మాచారం. ఒక్క కంఠాయ‌పాలెం రోడ్డులోనే 5 అక్రమ వెంచ‌ర్లు కొన‌సాగుతున్నాయి. 16 ఎక‌రాల మేర విస్తీర్ణంలో ఉన్న నాలుగు అక్రమ వెంచ‌ర్లలో ఇప్పటికే ప‌దుల సంఖ్యలో ప్లాట్లు అమ్ముడుపోయిన‌ట్లు స‌మాచారం. అలాగే టీచ‌ర్స్ కాల‌నీ స‌మీపంలో ఐదెక‌రాల విస్తీర్ణంలోని ఓ అక్రమ‌ వెంచ‌ర్‌లో ప్లాట్ల అమ్మకాలు జ‌రుగుతున్నాయి. ఇవేకాక చిన్న చిన్న అక్రమ‌ లే అవుట్లలో.. బోర్డు పెట్టకుండానే ప్లాట్ల విక్రయాలు జ‌రిగిపోతున్నాయి.

పొలం భూమిని ప్లాట్లుగా చూపి..
వ్యవ‌సాయభూమిని ఆవాస భూమిగా మార్చుకోవ‌డానికి నాన్ అగ్రిక‌ల్చర్ లే అవుట్ అసెస్‌మెంట్‌(నాలా) ప‌న్ను క‌ట్టాల్సి ఉంటుంది. నాలా క‌న్వర్జేష‌న్ చేయ‌కుండానే వ్యవ‌సాయ భూమిగానే కొనుగోలు దారుల‌కు రిజిస్ట్రేష‌న్ చేసేస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన భూముల్లో ఇల్లు క‌ట్టుకోవాలంటే కొనుగోలుదారులు త‌ర్వాత అయినా ల్యాండ్ రెగ్యులేష‌న్ స్కీం (ఎల్ ఆర్ ఎస్‌)కు అప్లై చేసుకోవాల్సి వ‌స్తుంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా నిబంధ‌న‌ల‌ను క‌ఠిన‌త‌రం చేయ‌డంతో ఇబ్బందులు త‌ప్పవ‌ని రెవెన్యూ అధికారులే పేర్కొంటున్నారు. పొలాల‌ను ప్లాట్లుగా చూపి.. పొలం భూమిగానే చూపుతూ జ‌నాల‌కు రియ‌ల్ వ్యాపారులు కుచ్చుటోపి పెడుతున్నారు. వాస్తవానికి ఈ రియ‌ల్ మోసాల‌పై త‌రుచూ గొడ‌వ‌లు జ‌రుగుతున్నా అధికారులు ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న ఆరోప‌ణ‌లున్నాయి.

agricalture

అదిగో అభివృద్ధి.. ఇదిగో వెంచ‌రు..

వ‌రంగ‌ల్‌-ఖ‌మ్మం ప్రధాన ర‌హ‌దారిపై ఉన్న తొర్రూరు రెవెన్యూ డివిజ‌న్‌గా ఏర్పడ్డాక వేగంగా అభివృద్ధి చెందుతోంది. వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల‌కు ఆవాసంగా మారింది. ఇక్కడే స్థిర‌నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. దీనికితోడు మునిసిప‌ల్ కేంద్రంగా అవ‌త‌రించ‌డం ప‌ట్టణాభివృద్ధికి క‌లిసి వ‌చ్చింద‌నే చెప్పాలి. అయితే చెట్టు పేరు చెప్పి కాయ‌లు అమ్మిన చందంగా తొర్రూరు ప‌ట్టణాన్ని చూపుతూ చుట్టుప‌క్కల ఐదారు కిలోమీట‌ర్ల విస్తీర్ణంలోని పొలాల్లో వెంచ‌ర్ల బోర్డులు పెట్టేస్తున్నారు. ఎక‌రం మొద‌లు 15 ఎక‌రాల‌ వ‌ర‌కు అనుమ‌తుల్లేని వెంచ‌ర్లను నిర్వహిస్తున్నారు. అయితే 3నుంచి 5ఎక‌రాల్లోపు ఉన్న వెంచ‌ర్లే ఎక్కువ‌గా ఉంటుండ‌టం గ‌మ‌నార్హం. మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రెవిన్యూ డివిజ‌న్‌లో రియ‌ల్ మోసాలు ఈ స్థాయిలో జ‌రుగుతున్నా ప‌ట్టించుకునే నాథుడే లేక‌పోవ‌డంపై ప్రజ‌లు పెద‌వివిరుస్తున్నారు.

గ‌జం రూ.15వేల పైమాటే..
రహదారికి దగ్గరగా ఉంటే గజం రూ.18వేల నుంచి రూ.20వేలకు విక్రయిస్తున్నారు. అదే దూరంగా ఉంటే రూ.12వేలకు పైగా విక్రయిస్తున్నారు. తొర్రూరుకు మూడు నాలుగు కిలోమీట‌ర్ల దూరంలోనూ రూ.4-5వేల మధ్య గజం స్థలం విక్రయిస్తున్నారు. ఈ విష‌యం తెలిసినా మునిసిప‌ల్, రెవెన్యూ అధికారులు ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. మాముళ్లకు అల‌వాటుప‌డే అక్రమంగా కొన‌సాగుతున్న వెంచ‌ర్ల వైపు క‌న్నెత్తి కూడా చూడ‌టం లేద‌ని స‌మాచారం. ఇల్లు క‌ట్టుకోవాల‌నే ఆశ‌యం, పెట్టుబ‌డికి మంచి మార్గం అనే అభిప్రాయంతో పైసాపైసా పోగేసి కొనుగోలు చేసిన ప్లాట్లకు అనుమ‌తుల్లేవ‌ని తెలిసి సామాన్య జ‌నం మోస‌పోయామ‌ని ఆవేద‌న చెందుతున్నారు.



Next Story

Most Viewed