పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి.. గుండు చేయించుకున్న యువతి.. 'ప్లాన్ అదిరింది' అంటున్న నెటిజన్స్

by Muthe.Rajitha |

పెళ్లి ఒత్తిడిపై ఓ ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్ వినూత్నంగా, అత్యంత సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి.. గుండు చేయించుకున్న యువతి.. ప్లాన్ అదిరింది అంటున్న నెటిజన్స్
X

దిశ, వెబ్ డెస్క్ : సమాజంలో ఎంతో మంది యువతులు ఎదుర్కొంటున్న పెళ్లి ఒత్తిడిపై ఓ ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్ వినూత్నంగా, అత్యంత సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ప్రముఖ సోషల్ మీడియా క్రియేటర్ కీర్తనా మీనన్ (Keerthana Menon)ను ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడికి గురిచేస్తుండటంతో, పెళ్లి బారి నుంచి తప్పించుకునేందుకు తలపై ఉన్న జుట్టు పూర్తిగా తొలగించుకొని, గుండు గీయించుకుంది. దీనికి 'మా నాకు పెళ్లి చేయాలని చూస్తోంది' అంటూ వ్యంగంగా క్యాప్షన్ కూడా ఇవ్వడంతో పెళ్లి పేరుతో నేటి యువతులు ఎంత ఒత్తిడికి గురవవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వీడియోను కీర్తన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేయడంతో అది కాస్తా ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.

నెటిజన్ల ప్రశంసల జల్లు

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై ప్రత్యక్షమైన కొద్ది నిమిషాల్లోనే లక్షలాది వ్యూస్, వేలాది కామెంట్లతో విపరీతంగా వైరల్ అయింది. కీర్తనా మీనన్ తీసుకున్న ఈ బోల్డ్ నిర్ణయాన్ని నెటిజన్లు, ముఖ్యంగా యువతులు పెద్ద ఎత్తున అభినందిస్తున్నారు. "ప్లాన్ అదిరింది", "వ్యక్తిగత స్వేచ్ఛ అనేది అన్నింటికంటే ముఖ్యం", "అందమైన హెయిర్ కంటే ఆత్మగౌరవమే మిన్న" అంటూ ఆమెకు మద్దతుగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సొంత కుటుంబ సభ్యుల నుండి బలవంతపు పెళ్లిళ్ల ఒత్తిడిని ఎదుర్కొంటూ, బయటకు చెప్పుకోలేక సతమతమవుతున్న ఎంతో మంది మహిళలకు కీర్తనా ఒక పెద్ద ఇన్‌స్పిరేషన్ అంటూ కొనియాడుతున్నారు. తనకు జుట్టు అంటే ఎంతో ఇష్టమని, కానీ తన జీవిత నిర్ణయాలను తీసుకునే స్వేచ్ఛను కాపాడుకోవడం కోసం తాను ఈ కఠినమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని కీర్తనా మీనన్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో మహిళల వ్యక్తిగత హక్కులు, పెళ్లిళ్ల విషయంలో వారి ఇష్టాయిష్టాలపై సరికొత్త చర్చ నడుస్తోంది.

Next Story