బస్ స్టాండ్‌లో యువతి దారుణ హత్య.. నడిరోడ్డుపై వేటకొడవలితో నరికిన ప్రేమోన్మాది

by Malleboina Mahesh |   (  Updated:2026-07-17 06:44:12  IST  )

కర్ణాటక బి.సి. రోడ్డు బస్ స్టాండ్‌లో నర్సు లావణ్యపై వేటకొడవలితో దాడి చేసి చంపిన ఉన్మాది.. వన్ సైడ్ లవ్ వేధింపులే కారణమంటున్న పోలీసులు!

బస్ స్టాండ్‌లో యువతి దారుణ హత్య.. నడిరోడ్డుపై వేటకొడవలితో నరికిన ప్రేమోన్మాది
X

దిశ, వెబ్ డెస్క్: ప్రేమ పేరుతో యువతులపై జరుగుతున్న దారుణాలు నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. రోజు దేశంలోని ఏదో ఒక మూలన తనను ప్రేమించాలని ఇబ్బందులు పెట్టడం, హత్యలు చేయడం వంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది. తనను ప్రేమించడం లేదనే కారణంతో ఓ యువతిని నింధితుడు అంతా చూస్తుండగానే బస్టాండ్ లో కత్తితో దారుణంగా నరికి హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బంత్వాల్ తాలూకా పరిధిలోని బి.సి. రోడ్డు కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్‌లో గురువారం సాయంత్రం ఈ అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కల్లాడ్కలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న లావణ్య (21) విధులను ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు బస్సెక్కింది.

అయితే, ఆమెను కొంతకాలంగా వన్ సైడ్ లవ్ పేరుతో వేధిస్తున్న చేతన్ (22) అనే ఉన్మాది కూడా అదే బస్సెక్కి బ్యాగులో నుంచి కత్తిని తీశాడు. అది గమనించి ప్రాణాలు కాపాడుకోవడానికి లావణ్య బస్సు దిగి బస్ స్టాండ్ ఆవరణలోకి పరుగెత్తినా, ఉన్మాది వెంబడించి ఆమె మెడ వెనుక భాగంలో కిరాతకంగా నరికాడు. ఈ దాడిలో తీవ్ర రక్తస్రావమై లావణ్య ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే జరిగిన ఈ భయానక హత్య స్థానికంగా తీవ్ర కలకలం గా మారింది. నిందితుడు చేతన్ లావణ్యకు దూరపు బంధువని, ఆమె తన ప్రేమను నిరాకరించిందనే కక్షతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. దాడి అనంతరం నిందితుడు ఆయుధాన్ని అక్కడే పడేసి కారులో పరారయ్యాడు. ఈ ఘటనపై బంత్వాల్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, నిందితుడు చేతన్ ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు.

Next Story