రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం: మంత్రి నాదెండ్ల మనోహర్

by Malleboina Mahesh |

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా జనసేన సమాయత్తం.. పార్టీ బలంగా ఉన్న చోట కచ్చితంగా పోటీ చేస్తామన్న మంత్రి నాదెండ్ల మనోహర్!

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం: మంత్రి నాదెండ్ల మనోహర్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. తెనాలిలో శుక్రవారం మీడియా సమావేశంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై జనసేన పార్టీ కేడర్‌కు దిశా నిర్దేశం చేస్తూ పలు కీలక అంశాలను వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ (NDA) కూటమి అఖండ విజయమే లక్ష్యంగా జనసేన పార్టీ పూర్తి స్థాయిలో సమాయత్తమవుతోందని ఆయన ప్రకటించారు.

క్షేత్రస్థాయి ఆకాంక్షలను గౌరవిస్తాం

2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర సంక్షేమం కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన త్యాగాలను మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. "ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో ఇప్పటం సభలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనకు కట్టుబడి, కూటమి విజయం కోసం ఆయన నాలుగు అడుగులు వెనక్కి తగ్గారు. ప్రజల సంక్షేమం కోసం అప్పుడు తీసుకున్న ఆ నిర్ణయాలను, ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో ముడిపెట్టి కొంతమంది మాట్లాడటం సరైన విధానం కాదు" అని హితవు పలికారు.

జనసేన పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో తప్పకుండా పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళల అభిప్రాయాలు, ఆవేదనలను పార్టీ నాయకత్వం పూర్తిగా అర్థం చేసుకుందని.. కూటమి భాగస్వామ్యాన్ని గౌరవిస్తూనే అన్ని పార్టీలతో సమన్వయం చేసుకుని జనసైనికులకు తగిన అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేస్తూ స్థానిక పోరుకు సిద్ధమవుతామని నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.

Next Story