లార్డ్స్ వన్డేనే రోహిత్‌కు చివరిదా?.. రిటైర్మెంట్ వార్తలపై స్పందించిన టీమిండియా కోచ్

by Gantepaka Srikanth |

టీమిండియా మాజీ కెప్టెన్, ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ వన్డే రిటైర్మెంట్‌పై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు క్రికెట్ వర్గాల్లో పెను సంచలనంగా మారాయి.

లార్డ్స్ వన్డేనే రోహిత్‌కు చివరిదా?.. రిటైర్మెంట్ వార్తలపై స్పందించిన టీమిండియా కోచ్
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్, ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ వన్డే రిటైర్మెంట్‌పై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు క్రికెట్ వర్గాల్లో పెను సంచలనంగా మారాయి. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్ జరగబోయే మూడో వన్డేనే రోహిత్ కెరీర్లో చివరి మ్యాచ్ కాబోతుందంటూ ప్రచారం జరుగుతుండటంతో అభిమానుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో భారత జట్టు మేనేజ్మెంట్ తొలిసారి ఈ వివాదంపై స్పందించింది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాను కోటక్ స్పందించారు. అయితే, ఆయన నేరుగా రిటైర్మెంట్ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా దాటవేసినప్పటికీ.. రోహిత్ ప్రస్తుత ఫామ్, జట్టులో అతని ప్రాధాన్యతపై కీలక వ్యాఖ్యలు చేశారు. "రోహిత్‌పై ఎలాంటి ఒత్తిడి లేదు. అతను ఇప్పటికీ భారత జట్టుకు అత్యంత కీలకమైన ఆటగాడు" అని కోటక్ స్పష్టం చేశారు.

రెండు మ్యాచ్‌లలో విఫలమైతే తప్పా?

ఇటీవల రోహిత్ శర్మ స్థానంలో యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్ లేదా యశస్వి జైస్వాల్‌ను ఓపెనర్లుగా జట్టులోకి తీసుకురావాలనే చర్చలు ఊపందుకున్నాయి. దీనిపై సీతాను కోటక్ స్పందిస్తూ.. వరుసగా రెండు వన్డేల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినంత మాత్రాన రోహిత్ లాంటి సీనియర్ క్లాస్ ప్లేయర్ ఆటను తక్కువ అంచనా వేయడం సరికాదని గట్టిగా సమర్థించారు. మరోవైపు 39 ఏళ్ల రోహిత్ శర్మ. 2027 వన్డే ప్రపంచకప్ ఆడాలనే బలమైన లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకోసమే తన ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి, దాదాపు 10 కిలోల బరువు కూడా తగ్గాడు. అయితే, భవిష్యత్ (2027 వరల్డ్ కప్) ప్రణాళికల్లో భాగంగా రోహిత్‌కు వన్డే జట్టులో స్థానం ఉండకపోవచ్చని బీసీసీఐ ఇప్పటికే హిట్‌మ్యాన్‌కు స్పష్టం చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

Next Story