సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండి శ్రద్ధగా చదువుకోవాలి

by Ratna Kumari |

విద్యార్థులు సోషల్ మీడియా, ఇతర సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండి చదువుపై పూర్తి దృష్టి సారించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు.

సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండి శ్రద్ధగా చదువుకోవాలి
X

దిశ, బోథ్ : విద్యార్థులు సోషల్ మీడియా, ఇతర సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండి చదువుపై పూర్తి దృష్టి సారించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. బుధవారం సోనాల మండల కేంద్రంలోని పీఎం శ్రీ జడ్పీ సెకండరీ పాఠశాలలో నిర్వహించిన 'ఆరోగ్య పాఠశాల' కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం రాగి జావ వంటి పౌష్టికాహారం అందించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా విద్యార్థినుల్లో రక్తహీనత నివారణకు రాగి జావ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.

జంక్ ఫుడ్, చిప్స్ వంటి అనారోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండి క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. మొబైల్ ఫోన్లను కేవలం చదువు కోసమే వినియోగించాలని, రీల్స్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటూ చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్ రెడ్రెస్సల్ కమిటీ ఆధ్వర్యంలో పాఠశాలలో ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అందులో వచ్చే ఫిర్యాదులను ప్రధానోపాధ్యాయులతో కలిసి కమిటీ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

పాఠశాల అభివృద్ధికి డీఆర్‌డీఓ సహకారంతో న్యూట్రీ గార్డెన్, కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్, మరుగుదొడ్ల నిర్మాణానికి త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని కలెక్టర్ వెల్లడించారు. అలాగే మండలంలో కొత్త ఎంఆర్ఓ కార్యాలయ భవన నిర్మాణ పనులను కూడా త్వరలో ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పాఠశాలలో గ్రంథాలయం, న్యూట్రీ గార్డెన్‌ను ప్రారంభించిన కలెక్టర్, కంప్లైంట్ బాక్స్‌లో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత అధికారులకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ మాధవి, డీఆర్‌డీఓ రవీందర్ రాథోడ్, ఎంఆర్ఓ మల్లేష్, ఎంపీడీఓ రత్నాకర్ రావు, ఎంఈఓ ఉస్సేన్, సర్పంచ్ బిందుజ, ప్రధానోపాధ్యాయులు సచిన్, విద్యాశాఖ సిబ్బంది, విడీసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

Next Story