- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యానాది ముఠా గుట్టు రట్టు
పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న అంతర్‌రాష్ట్ర ఘరానా దొంగల ముఠా గుట్టును ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజర పోలీసులు రట్టు చేశారు.

దిశ, పెనుబల్లి : పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న అంతర్‌రాష్ట్ర ఘరానా దొంగల ముఠా గుట్టును ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజర పోలీసులు రట్టు చేశారు. వీఎం బంజర పోలీస్ స్టేషన్‌లో సోమవారం ఏసీపీ వసుంధర యాదవ్ సమక్షంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నేరస్తుల వివరాలను వెల్లడించారు. లంకపల్లి గ్రామ శివారులో కాపలాగా ఉన్న తోటలో అనుమానితులు సంచరిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు మంగళవారం వీఎం బంజర ఎస్సై వెంకటేష్ తన సిబ్బందితో అక్కడికి వెళ్లి అనుమానితులను పట్టుకుని విచారించగా వారు దొంగల ముఠాగా తేలింది. వెంటనే పంచులను పిలిచి, వారి సమక్షంలో మాణికల వసంతరావు, మాణికల రమేష్, పొన్నూరి కోటేశ్వరరావు, తుమ్మల శేఖర్‌లను వీఎం బంజర పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించారు.
విచారణలో మాణికల వసంతరావు గతంలో దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి వచ్చినట్లు తేలింది. ఈ నలుగురు ఒక ముఠాగా ఏర్పడి, ముందస్తు ప్రణాళిక ప్రకారం తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని, గడ్డపార సహాయంతో తాళాలు పగులగొట్టి ఇంట్లోని బంగారం, వెండి, నగదు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలు
పోలీసులు తమదైన శైలిలో లోతుగా విచారించడంతో నిందితులు వీఎం బంజర పోలీస్ స్టేషన్ పరిధిలోనే కాకుండా పలు జిల్లాల్లోని ఇతర పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా వరుస దొంగతనాలు చేసినట్లు అంగీకరించారు. ఖమ్మం జిల్లా వీఎం బంజర పోలీస్ స్టేషన్, వేంసూర్ పోలీస్ స్టేషన్, సత్తుపల్లి టౌన్ పోలీస్ స్టేషన్, ఏలూరు జిల్లా చాట్రాయి పోలీస్ స్టేషన్ పరిధిలో వీరు చోరీలకు పాల్పడినట్లు ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు. నిందితుల నుంచి రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని, వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. కేసును వేగంగా ఛేదించిన వీఎం బంజర ఎస్సై వెంకటేష్‌తో పాటు సిబ్బందిని ఏసీపీ అభినందించారు.
నేరస్తులు పాల్పడ్డ దొంగతనాలు
1. ఏలూరు జిల్లా, చిన్నంపేట గ్రామం, చాట్రాయి పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.80,000 విలువైన బంగారు ఆభరణాలు, రూ.20,000 నగదు.
2. ఖమ్మం జిల్లా, దుద్దెపూడి గ్రామం, వేంసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.65 వేల విలువైన 20 గ్రాముల బంగారం, 100 గ్రాముల వెండి.
3. ఖమ్మం జిల్లా, సత్తుపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో హుండీ పగులగొట్టి రూ.5,000 నగదు అపహరణ.
4. ఖమ్మం జిల్లా, లంకపల్లి గ్రామం, వీఎం బంజర పోలీస్ స్టేషన్ పరిధిలో 108 గ్రాముల బంగారం (సుమారు రూ.3 లక్షల విలువ), 900 గ్రాముల వెండి (సుమారు రూ.50 వేల విలువ), రూ.3.70 లక్షల నగదు.
5. ఖమ్మం జిల్లా, కందుకూరు గ్రామం, వేంసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 20 గ్రాముల బంగారం, ఒక కిలో వెండి చోరీ.
6. ఖమ్మం జిల్లా, కందుకూరు గ్రామం, వేంసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో దొంగతనానికి పాల్పడినట్లు కేసు నమోదు.
7. ఖమ్మం జిల్లా, అడవిమల్లెల గ్రామం, వీఎం బంజర పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.1,80,000 విలువైన 45 గ్రాముల బంగారం, రూ.5,000 విలువైన వెండి వస్తువులు, రూ.3,70,000 నగదు కలిపి మొత్తం రూ.5,55,000 విలువైన ఆస్తి చోరీ చేశారు.






