- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏసీబీ వలలో మరో బడా బాబు.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎక్సైజ్ ఎస్పీ అరెస్ట్
రాష్ట్రంలో వరుసగా అవినీతి అధికారుల భరతం పడుతున్న ఏసీబీ వలలో మరో బడా అధికారి చిక్కాడు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వరుసగా అవినీతి అధికారుల భరతం పడుతున్న ఏసీబీ వలలో మరో బడా అధికారి చిక్కాడు. తన పదవిని అడ్డం పెట్టుకుని అక్రమ మార్గాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టిన నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డిపై ఏసీబీ అధికారులు మంగళవారం మెరుపు దాడులు చేశారు. ఆయన తన సర్వీసులో అవినీతికి పాల్పడుతూ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారన్న పక్కా సమాచారంతో.. ఏసీబీ కేసు నమోదు చేసి ఏకకాలంలో సోదాలు నిర్వహించింది.
11 చోట్ల దాడులు.. బయటపడిన ఆస్తుల చిట్టా..
మల్లారెడ్డి అవినీతి, అక్రమాలపై అందిన ఫిర్యాదుల మేరకు ఏసీబీ అధికారులు ఆయనపై ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ల కింద ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. ఈ మేరకు మంగళవారం మల్లారెడ్డి నివాసంతో పాటు, ఆయన బంధువులు, బినామీలు, అనుచరులకు సంబంధించిన మరో 10 చోట్ల మొత్తం 11 ప్రాంతాల్లో ఏసీబీ ప్రత్యేక బృందాలు విస్తృత తనిఖీలు చేపట్టాయి. ఈ సోదాల్లో ఏసీబీ అధికారులు భారీ ఎత్తున స్థిర, చరాస్తులు గుర్తించారు. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల వివరాల ప్రకారం.. నాలుగు నివాస గృహాలు, ఒక కమర్షియల్ కాంప్లెక్స్, 8 ఓపెన్ ప్లాట్లతో పాటు 10.23 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు తేలింది.
మార్కెట్ విలువ కోట్లలోనే..
స్థిరాస్తులతో పాటు మల్లారెడ్డి ఇంట్లో సుమారు రూ.3,31,000 నగదు లభించగా, వివిధ బ్యాంక్ ఖాతాల్లో ఏకంగా రూ.50 లక్షల బ్యాలెన్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఒక గ్రాండ్ విటారా కారు, ఒక టీవీఎస్ స్కూటీని సైతం సీజ్ చేశారు. మల్లారెడ్డి భార్య, ఇతర కుటుంబ సభ్యుల పేరిట ఉన్న 3 బ్యాంకు లాకర్లను అధికారులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా త్వరలో వీటిని తెరవనున్నారు. అయితే, ఏసీబీ ఇప్పటివరకు గుర్తించిన ఈ ఆస్తుల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ విలువే సుమారు రూ.3 కోట్లు ఉంటుందని, కానీ బహిరంగ మార్కెట్లో వీటి విలువ డాక్యుమెంట్ విలువ కంటే అనేక రెట్లు ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఇంకా అదనపు ఆస్తుల వెరిఫికేషన్ కొనసాగుతోందని ఏసీబీ పేర్కొంది.
అరెస్టు.. డిమాండ్..
మల్లారెడ్డికి సంబంధించిన ఆస్తుల లెక్కలపై మరింత లోతుగా విచారణ జరుగుతోంది. దాడుల అనంతరం నిందితుడైన మల్లారెడ్డిని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు.. హైదరాబాద్ నాంపల్లిలోని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం 2వ అదనపు స్పెషల్ జడ్జి ముందు హాజరుపరిచి, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
లంచం అడిగితే ఉపేక్షించొద్దు: ఏసీబీ విజ్ఞప్తి
మరోవైపు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ స్థాయి అధికారైనా, సిబ్బంది అయినా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు భయపడకుండా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఏసీబీ అధికారులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. బాధితులు, ఫిర్యాదు దారుల పేర్లు, వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. ఎవరైనా లంచం అడిగితే టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు కాల్ చేయాలని, లేదా 9440446106 నంబర్‌కు వాట్సాప్ ద్వారా ఆధారాలతో సహా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. వీటితో పాటు ఫేస్‌బుక్ Telangana ACB, ఎక్స్/ట్విట్టర్ @TelanganaACB వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన ఏసీబీ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా కూడా నేరుగా ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు పంపవచ్చని ఏసీబీ అధికారులు సూచించారు.






