డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయండి : కలెక్టర్

by Batti.Sumithra |

నిరుపేదలకు సొంత ఇంటి కల సాకారం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రెండు పడకగదుల (2BHK) ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల ఆదేశించారు.

డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయండి : కలెక్టర్
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : నిరుపేదలకు సొంత ఇంటి కల సాకారం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రెండు పడకగదుల (2BHK) ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం జిల్లాలోని ఆసిఫ్‌నగర్‌లోని భోజగుట్టలో రెండు పడకగదుల ఇండ్ల నిర్మాణ పనులను హౌసింగ్ పీడీ అశోక్ చక్రవర్తి, ఆర్‌డీఓ రామకృష్ణ, జీహెచ్‌ఎంసీ ఈఈ నర్సయ్యలతో కలిసి ఆమె పరిశీలించారు. ఇండ్లకు సంబంధించిన మ్యాప్‌ను పరిశీలించి, ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిపై పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనుల ఆలస్యంపై సంబంధిత కాంట్రాక్టర్‌ను వివరణ కోరారు. నిర్మాణంలో ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే వాటిని అధిగమించి పనులు వేగవంతం చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. మంజూరైన ఇండ్ల నిర్మాణాన్ని నిర్దేశించిన వ్యవధిలోగా పూర్తి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. భోజగుట్టలో 13 ఎకరాల్లో 1,824 రెండు పడకగదుల ఇండ్లు మంజూరు కాగా, 73 బ్లాకుల్లో నిర్మాణం చేపట్టడం జరిగిందని, వీటిలో ప్రస్తుతం 192 పూర్తయ్యాయని, మిగిలిన ఇండ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు యంత్రాంగం నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జ్యోతి, జీహెచ్‌ఎంసీ డీఈ కలీమ్, హౌసింగ్ ఏఈలు మనోజ్, మానస, కాంట్రాక్టర్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story