- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్షేత్రస్థాయిలో ఇలా..అధికారులు అలా
విద్యా వ్యవస్థలో పారదర్శకతకు తూట్లు పొడుస్తూ, విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్థిక బలహీనతను ఆసరాగా చేసుకుని పాఠ్యపుస్తకాల విక్రయాల పేరుతో భారీ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు కారేపల్లి మండల కేంద్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

దిశ, కారేపల్లి : విద్యా వ్యవస్థలో పారదర్శకతకు తూట్లు పొడుస్తూ, విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్థిక బలహీనతను ఆసరాగా చేసుకుని పాఠ్యపుస్తకాల విక్రయాల పేరుతో భారీ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు కారేపల్లి మండల కేంద్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మండల కేంద్రంలోని శ్రీనివాస్ బుక్ స్టాల్‌లో సంబంధిత శాఖల అనుమతులు లేకుండానే ప్రైవేట్ పాఠశాలల పాఠ్యపుస్తకాల విక్రయాలు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో బహిరంగంగానే పుస్తకాల విక్రయాలు జరుగుతున్నప్పటికీ, అధికార యంత్రాంగం మాత్రం అలాంటి వ్యవహారాలేమీ లేవన్నట్లుగా వ్యవహరిస్తుండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలతో ముందస్తు అవగాహన కుదుర్చుకుని, ఆయా పాఠశాలలకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను ఒకే కేంద్రంలో విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా, సంబంధిత అనుమతులు లేకుండానే ఈ విక్రయాలు సాగుతున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాఠశాలలు సూచించిన పేరుతో తప్పనిసరిగా అక్కడి నుంచే పుస్తకాలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొనడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆర్థిక భారం మోస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవల కారేపల్లి బీసీ కాలనీకి చెందిన ఓ విద్యార్థి తండ్రి తన రెండో తరగతి చదువుతున్న కుమారుడికి సంబంధించిన పాఠ్యపుస్తకాల సెట్‌ను రూ.2,610 చెల్లించి కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. అయితే అంత మొత్తాన్ని వసూలు చేసినప్పటికీ సరైన బిల్లు ఇవ్వలేదని, కేవలం తెల్ల కాగితంపై ధరలు రాసి చేతికిచ్చారని ఆరోపించారు. ఇది వినియోగదారుల హక్కుల ఉల్లంఘన మాత్రమే కాకుండా పన్ను ఎగవేత అనుమానాలకు కూడా బలాన్ని చేకూరుస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న విద్యా రంగంలో ఇలాంటి ఆరోపణలు వెలుగుచూస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు సమగ్ర తనిఖీలు నిర్వహించడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండల కేంద్రంలోనే బహిరంగంగా పుస్తకాల విక్రయాలు సాగుతున్నాయని స్థానికులు చెబుతుండగా, అధికారుల నుంచి మాత్రం స్పష్టమైన స్పందన లేకపోవడం పలు సందేహాలకు దారితీస్తోంది.
క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు ఒకలా ఉండగా, అధికారుల ప్రకటనలు మరోలా ఉండటం వెనుక కారణాలేమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికే ప్రైవేట్ విద్య ఖర్చులతో సతమతమవుతున్న మధ్యతరగతి కుటుంబాలపై పాఠ్యపుస్తకాల పేరుతో అదనపు భారం పడుతోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. పుస్తకాల ధరలపై ఎలాంటి నియంత్రణ లేకపోవడం, బిల్లులు ఇవ్వకపోవడం, ఒకే కేంద్రంలో విక్రయాలకు ప్రోత్సాహం లభించడం వంటి అంశాలు తల్లిదండ్రులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ వ్యవహారం పై జిల్లా స్థాయి ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని సమగ్ర విచారణ చేపట్టాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అనుమతులు లేకుండా పాఠ్యపుస్తకాల విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు నిజమైతే సంబంధిత బుక్ స్టాల్ యాజమాన్యంతో పాటు కుమ్మక్కైన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అంతేకాకుండా ప్రైవేట్ పాఠశాలలు, పుస్తక విక్రయ కేంద్రాల మధ్య ఉన్న సంబంధాల పై లోతైన విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు కారేపల్లి మండలంపై జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. మండలంలోని విద్యాసంస్థలు, పుస్తక విక్రయ కేంద్రాలపై జిల్లా విద్యాశాఖ అధికారి స్థాయిలో సమగ్ర తనిఖీలు జరిగిన దాఖలాలు లేవని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరోపణలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఇకనైనా స్పందించి వాస్తవాలను వెలికితీసి బాధ్యులపై చర్యలు తీసుకుంటారా..? లేక ఎప్పటిలాగే ఫిర్యాదులను బుట్టదాఖలు చేస్తారా..? అన్న ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. మండల విద్యాశాఖ అధికారి జయరాజు వివరణ కోరగా : పాఠ్య పుస్తకాల విక్రయాల అనుమతులు డీఈఓ ఆఫీస్ నుంచి తీసుకోవాలని మేము విద్యాశాఖ నుంచి ఎవరికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని విక్రయించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.






