- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తప్పుచేశా..క్షమించండి..!
మండల పరిధిలోని గంగారం తండా గ్రామంలో డ్వాక్రా మహిళా సంఘాలకు చెందిన బుక్‌కీపర్, సెకండ్ లీడర్ కలిసి సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేసిన వ్యవహారం గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

దిశ, కారేపల్లి : మండల పరిధిలోని గంగారం తండా గ్రామంలో డ్వాక్రా మహిళా సంఘాలకు చెందిన బుక్‌కీపర్, సెకండ్ లీడర్ కలిసి సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేసిన వ్యవహారం గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.పుష్ప గ్రూప్ సభ్యుల సంతకాలను నకిలీగా నమోదు చేసినట్లు ఇటీవల(సీసీ) పద్మ విచారణలో నిర్ధారణ కావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.అయితే తప్పిదం రుజువైనప్పటికీ సంబంధిత అధికారుల నుంచి తక్షణ చర్యలు తీసుకోకపోవడంపై మహిళా సంఘాల సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కారేపల్లి పోలీస్ స్టేషన్‌లో బుక్‌కీపర్ ప్రసాద్, సెకండ్ లీడర్‌పై చర్యలు తీసుకోవాలని గ్రూప్ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీస్ అధికారులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారం సీసీ పద్మ,గంగారం తండా గ్రామంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.స్థానిక సర్పంచ్ కిరణ్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి గ్రామస్తులు, మహిళా సంఘాల సభ్యులు, సంబంధిత అధికారులు హాజరయ్యారు. సమావేశంలో సీసీ పద్మ విచారణ నివేదికను బహిరంగంగా వివరించారు.
బుక్‌కీపర్ ప్రసాద్, సెకండ్ లీడర్ కలిసి సంతకాల ఫోర్జరీకి పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు.ఈ నేపథ్యంలో వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో సభ్యుల అభిప్రాయాలను కోరారు.కొంతమంది సభ్యులు తప్పు చేసిన వారిని వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేయగా, మరికొందరు అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.దీంతో సర్పంచ్ ఆధ్వర్యంలో బహిరంగ ఓటింగ్ నిర్వహించారు.ఓటింగ్‌కు హాజరైన 16 మంది సభ్యులను బుక్‌కీపర్ ప్రసాద్ క్షమించి మరో అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడినట్లు తెలిసింది.సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న సీసీ పద్మ,బుక్‌కీపర్ ప్రసాద్‌ను తక్షణం తొలగించకుండా కఠిన హెచ్చరికతో విధుల్లో కొనసాగించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.అయితే భవిష్యత్తులో ఇలాంటి ఫోర్జరీలు, అక్రమాలు లేదా సభ్యుల నమ్మకాన్ని దెబ్బతీసే చర్యలకు పాల్పడితే ఎలాంటి ఉపేక్ష ఉండదని, నేరుగా విధుల నుంచి తొలగించే చర్యలు తీసుకుంటామని గ్రామసభ వేదికగా హెచ్చరించినట్లు సీసీ పద్మ తెలిపారు.తప్పిదం అంగీకరించి క్షమాపణలు కోరిన బుక్‌కీపర్‌కు మరో అవకాశం కల్పించడంపై గ్రామంలోభిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.తప్పు నిర్ధారణ అయిన వ్యక్తికి మద్దతు ఇవ్వడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న స్థానికంగా చర్చకు దారితీస్తోంది.






