NITI Aayog: నీతి ఆయోగ్ 'ట్రేడ్ వార్నింగ్'

by S Gopi |

గ్లోబల్ మార్కెట్ డిమాండ్‌కు తగ్గట్టుగా మన దేశీయ ఉత్పత్తి పెరగడం లేదని, విదేశీ వస్తువులపై మన ఆధారపడటం ఇంకా కొనసాగుతోందని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది.

NITI Aayog: నీతి ఆయోగ్ ట్రేడ్ వార్నింగ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఆర్థికవ్యవస్థకు వాణిజ్య రంగం నుంచి మిశ్రమ సంకేతాలు వస్తున్నాయని నీతి ఆయోగ్ తాజా ‘ట్రేడ్ వాచ్ క్వార్టర్లీ’ నివేదిక వెల్లడించింది. జనవరి-మార్చి త్రైమాసికంలో దేశ మొత్తం వాణిజ్యం 5.4 శాతం పెరిగి 1.84 ట్రిలియన్ డాలర్ల(రూ. 174.3 లక్షల కోట్ల)కు చేరినా, ఎగుమతుల కంటే దిగుమతులు వేగంగా పెరగడం ఆందోళన కలిగిస్తోందని అభిప్రాయపడింది. ఎగుమతులు 4.2 శాతం పెరిగితే, దిగుమతులు 6.5 శాతం వృద్ధి నమోదు చేశాయి. ముఖ్యంగా వస్తువుల ఎగుమతులు 2.8 శాతం తగ్గగా, దిగుమతులు 11.9 శాతం పెరిగాయి. అయితే ఐటీ, డిజిటల్ సేవల మద్దతుతో సేవల ఎగుమతులు 9 శాతం పెరిగి దేశానికి ఊరటనిచ్చాయి. సేవల రంగం నుంచి వచ్చిన మిగులు వల్ల మొత్తం వాణిజ్య లోటు 23.15 బిలియన్ డాలర్ల(రూ. 2.19 లక్షల కోట్ల)కే పరిమితమైంది. ఈ క్రమంలో, గ్లోబల్ మార్కెట్ డిమాండ్‌కు తగ్గట్టుగా మన దేశీయ ఉత్పత్తి పెరగడం లేదని, విదేశీ వస్తువులపై మన ఆధారపడటం ఇంకా కొనసాగుతోందని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది.

ఆదుకున్న ఐటీ రంగం

తయారీ రంగం ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. వస్తువుల ఎగుమతులు 2.8 శాతం తగ్గి 112 బిలియన్ డాలర్ల( రూ. 10.62 లక్షల కోట్ల)కు పడిపోగా, దిగుమతులు 11.9 శాతం పెరిగి 195.5 బిలియన్ డాలర్ల(రూ. 18.51 లక్షల కోట్ల)కు చేరాయి. తయారీ రంగం తెచ్చిన ఈ భారీ లోటును ఐటీ, డిజిటల్ సేవల రంగం బ్యాలెన్స్ చేసింది. సేవల ఎగుమతులు 9 శాతం పెరిగి 111 బిలియన్ డాలర్ల(రూ. 10.51 లక్షల కోట్ల)కు చేరడంతో ఏకంగా 60.4 బిలియన్ డాలర్ల(రూ. 5.72 లక్షల కోట్ల) మిగులు నమోదైంది. ఈ ఐటీ సామర్థ్యం వల్లే దేశ మొత్తం వాణిజ్య లోటు 23.15 బిలియన్ డాలర్ల(రూ. 2.19 లక్షల కోట్ల) వద్ద ఉందని నివేదిక పేర్కొంది.

బంగారం దిగుమతులు జంప్

ఇదే సమయంలో, ప్రస్తుతం దేశం నుంచి ఇనుము-ఉక్కు (18.4 శాతం), వాహనాల (14.2 శాతం) ఎగుమతులు పెరిగాయి. కానీ, గ్లోబల్ టెన్షన్స్ వల్ల రత్నాలు, ఆభరణాల ఎగుమతులు పడిపోయాయి. ఇటు దిగుమతుల వైపు.. బంగారం, వెండి సెగ్మెంట్లలో ఏకంగా 82 శాతం భారీ పెరుగుదల కనిపించింది. అదే సమయంలో ఇంధనాల దిగుమతులు 11 శాతం తగ్గాయి.

గ్లోబల్ ఫార్మసీ.. చైనా ముడిసరుకు దెబ్బ

మరోవైపు, ప్రపంచానికి జెనరిక్ మందులు సరఫరా చేసే ‘ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్’గా భారత్ గుర్తింపు పొందింది. అదే సమయంలో ఏపీఐల కోసం చైనాపై ఆధారపడటం వంటి బలహీనతలు బయటపడుతున్నాయి. ఆఫ్రికాకు అవసరమైన 50 శాతం మందులు మనమే ఇస్తున్నాం. కానీ, అత్యధిక ధర పలికే వ్యాక్సిన్లు, అడ్వాన్స్‌డ్ థెరపీల వంటి హై-వాల్యూ విభాగాలలో మన వాటా కేవలం 0.6 శాతమే ఉంది. దీనికి ప్రధాన కారణం, మందుల తయారీకి కావాల్సిన ఏపీఐల కోసం మనం ఇప్పటికీ 65 శాతం చైనాపైనే ఆధారపడుతున్నాం.

గ్లోబల్ మార్కెట్లో ఉన్న 1.3 ట్రిలియన్ డాలర్ల(రూ. 123.13 లక్షల కోట్ల) భారీ ఫార్మా అవకాశాన్ని అందుకోవాలంటే.. భారత్ కేవలం మందుల క్వాంటిటీ పెంచితే సరిపోదు. ఆర్‌అండ్‌డీపై ప్రస్తుతం పెడుతున్న 7 శాతం ఖర్చును పెంచి, టెక్ ఆధారిత 'హై-వాల్యూ' బ్రాండెడ్ ప్రొడక్ట్స్‌ను మార్కెట్లోకి తేవాలని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది.

Next Story