- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్ర టార్గెట్‌కు మించి వరి కొనుగోలు.. ప్రతి గింజను సేకరించాం: కేంద్ర మంత్రితో ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం విధించిన టార్గెట్‌ను మించి వరి కొనుగోలు తెలంగాణ ప్రభుత్వం చేపడుతుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం విధించిన టార్గెట్‌ను మించి వరి కొనుగోలు తెలంగాణ ప్రభుత్వం చేపడుతుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గత మూడు సీజన్లలో 69.50 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు వరి కొనుగోలు చేశామని, దీంతో రాష్ట్రంపై రూ.16,446 కోట్ల ఎంఎస్‌పీ భారం పడిందన్నారు. ఎండలు, హమాలీల కొరత, నిల్వ సమస్యలు, అకాల వర్షాల మధ్య కూడా సేకరించామని, రైతులకు ఎలాంటి నష్టం లేకుండా ప్రతి గింజను కొనుగోలు చేశామని స్పష్టం చేశారు. మంగళవారం ఢిల్లీకి వెళ్లిన ఆయన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ధాన్యం సేకరణపై వివరించారు. ఈ సందర్భంగా ఆయన పేర్కొంటూ రబీ సీజన్‌లో రికార్డు స్థాయిలో జరిగిన వరి కొనుగోళ్లతో కేంద్రం నిర్దేశించిన సేకరణ, సీఎంఆర్ సరఫరా గడువులను పొడిగించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి కనీస మద్దతు ధరకు ఒక్క గింజ కూడా నష్టపోకుండా కొనుగోలు చేసినట్లు తెలిపారు. దేశంలోనే అత్యధికంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు 80.09 లక్షల మెట్రిక్ టన్నుల వరిని సేకరించిందని, కొనుగోలు ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఖరీఫ్, రబీ కలిపి 2025-26 మార్కెటింగ్ సీజన్‌లో 152 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా వరి సేకరణ జరిగి చారిత్రాత్మక రికార్డు నమోదైంది. రాష్ట్రం పంపిన ఉత్పత్తి అంచనాలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వరి సేకరణ లక్ష్యాలను తక్కువగా నిర్ధారించడంతో రాష్ట్రంపై భారీ ఆర్థిక భారం పడిందన్నారు.
రబీలో 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి సేకరణ అంచనాలు సమర్పించినప్పటికీ, కేంద్రం కేవలం 35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం (51.47 లక్షల మెట్రిక్ టన్నుల వరికి సమానం) మాత్రమే లక్ష్యంగా నిర్ణయించిందని తెలిపారు. రబీ 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, ఖరీఫ్ 2025-26కు సంబంధించి 14.24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కేంద్ర పూల్‌కు సరఫరా చేయాల్సి ఉందని తెలిపారు. నిల్వ స్థలాల కొరత, ఒకేసారి పలు సీజన్ల కొనుగోళ్లు కొనసాగడం, మిల్లింగ్ సామర్థ్యాలపై ఒత్తిడి వంటి కారణాలతో గడువులు పొడిగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రబీ 2024-25 సీఎంఆర్ సరఫరా గడువును మరో 60 రోజులు, ఖరీఫ్ 2025-26 గడువును 120 రోజులు పొడిగించాలని కోరారు. రబీ సేకరణ లక్ష్యాన్ని 35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం నుంచి 54.50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యానికి పెంచాలని, ఇప్పటికే సేకరించిన 80.09 లక్షల మెట్రిక్ టన్నుల వరికి సమానమైన పరిమాణాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. రబీ వరి ఎక్కువగా ఉప్పుడు బియ్యం తయారీకి అనుకూలంగా ఉండటంతో బాయిల్డ్ రైస్ రూపంలో సరఫరా చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. భవిష్యత్తులో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి కేంద్రం నిర్ణయించే సేకరణ లక్ష్యాలు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించే ఉత్పత్తి, కొనుగోలు అంచనాలకు అనుగుణంగా ఉండాలని సూచించారు. రైతుల పంటకు సకాలంలో మద్దతు ధర లభించాలంటే కేంద్ర లక్ష్యాలు, వాస్తవ ఉత్పత్తి పరిస్థితులు సమన్వయంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.






