చెట్టును సందర్శిస్తే.. సందర్శకులకు ఫైన్!

by Disha Web Desk 7 |
చెట్టును సందర్శిస్తే.. సందర్శకులకు ఫైన్!
X

దిశ, ఫీచర్స్ : కాలిఫోర్నియాలోని రెడ్‌వుడ్ నేషనల్ పార్క్ ప్రపంచంలోనే ఎత్తయిన చెట్లకు నిలయంగా ఉంది. ఈ పార్కులోని 115.92 మీటర్ల పొడవైన హైపెరియన్ చెట్టు 2006లో 'వరల్డ్స్ టాలెస్ట్ ట్రీ'గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం పొందింది. బ్లాగర్లు, ట్రావెల్ రైటర్స్, వెబ్‌సైట్స్ కారణంగా ప్రపంచ రికార్డ్ కలిగిన ఈ చెట్టు సందర్శనకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. జనాల తాకిడి వల్ల చెట్టుకు హాని కలుగుతున్నందున, దాని సమీపంలోకి వెళ్లేవారికి జరిమానా విధిస్తున్నట్లు పార్క్ మేనేజ్‌మెంట్ పేర్కొంది.

రెడ్‌‌వుడ్ పార్క్‌లో 'హైపెరియన్' చెట్టు గల ప్రాంతాన్ని ప్రస్తుతం మూసివేసినా.. సందర్శకులు మాత్రం దాన్ని చూసేందుకు అడవిబాట పడుతున్నారు. నిజానికి ఈ చెట్ల వేర్లు భూఉపరితలానికి దగ్గరగా పెరగడంతో పాటు వయసురీత్యా అవి సున్నితంగా ఉంటాయి. ఈ క్రమంలోనే సందర్శకుల ఫుట్ వాకింగ్ వల్ల దెబ్బతింటున్నాయి. ఒక్క సందర్శకుడైనా సరే ఆ ప్రాంతంలోని ఆవాసాలపై వినాశకరమైన ప్రభావాన్ని చూపుతాడు. పైగా ఈ సైట్‌కు వెళ్లే మార్గంలో మానవ వ్యర్థాలు సహా చెత్తను కూడా కనుగొన్నట్లు అక్కడి ఉద్యోగులు పేర్కొన్నారు. ఈ కారణాల వల్లే రికార్డ్ హోల్డింగ్ చెట్టును చూడటాన్ని అధికారికంగా పరిమితం చేయగా.. పార్కు ఆదేశాలను అతిక్రమించి ఎవరైనా దానికి సమీపంలోకి వెళితే ఆర్నెళ్ల జైలు శిక్షతో పాటు రూ. 3,93,048 ($5,000) జరిమానా విధించవచ్చు.

ప్రత్యేకమైన పరిస్థితుల కారణంగా ఇక్కడి రెడ్‌వుడ్స్ చాలా ఎత్తుకు పెరుగుతాయి. పెద్ద మొత్తంలో వర్షపాతం, నీటి శాతాన్ని కోల్పోకుండా వేసవి పొగమంచు నిరోధించడం, సమశీతోష్ణ వాతావరణం వంటివన్నీ ఆ చెట్ల పెరుగుదలకు దోహదం చేస్తాయి. అంతేకాదు ఒక్కో హైపెరియన్ చెట్లు 600 నుంచి 800 ఏళ్ల వరకు జీవిస్తుందని అంచనా.



Next Story