వీడియోల స్టోరీకి దర్శకుడు, నిర్మాత కుమారస్వామే: డీకే శివకుమార్

by Disha Web Desk 17 |
వీడియోల స్టోరీకి దర్శకుడు, నిర్మాత కుమారస్వామే: డీకే శివకుమార్
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల వీడియోలు వైరల్ కావడం వెనుక హెచ్‌డీ కుమారస్వామి హస్తం ఉందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బుధవారం అన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రజ్వల్ రేవణ్ణ అభ్యంతరకర వీడియోలు కలిగిన 25,000 పెన్ డ్రైవ్‌లను పంపిణీ చేయడం వెనుక డీకే శివకుమార్ హస్తం ఉందని కుమారస్వామి మంగళవారం ఆరోపించిన నేపథ్యంలో దానికి కౌంటర్‌గా డీకే శివకుమార్ ఈ విధంగా స్పందించారు.

హెచ్‌డీ కుమారస్వామికి పెన్ డ్రైవ్‌ల గురించి తెలుసని, ఈ వీడియోల కథకు నాయకుడు, దర్శకుడు, నిర్మాత ఆయనే అని శివకుమార్ అన్నారు. కుమారస్వామి నా రాజీనామాను కోరుతున్నారు, వక్కళిగల నాయకత్వానికి పోటీ ఉన్నట్లు కనిపిస్తోంది. ఆయన కోరుకుంటున్నట్లుగా నన్ను రాజీనామా చేయనివ్వండని శివకుమార్ వ్యంగ్యంగా అన్నారు. ఇతరుల రాజకీయాలను ముగించడం కుమారస్వామి పని, ఆయన బ్లాక్‌మెయిల్ కింగ్, అధికారులను, రాజకీయ నాయకులను బెదిరిస్తుంటాడు, ఆయన తన పని చేసుకోనివ్వండి, ఇవన్నీ చర్చించుకోవడానికి సమయం ఉంది, అసెంబ్లీలో వీటి గురించి చర్చిద్దాం అని డీకే తెలిపారు.

ఈ వీడియో క్లిప్‌ల వ్యవహారంలోకి తన తండ్రి హెచ్‌డీ దేవెగౌడ పేరును తీసుకురావద్దని కుమారస్వామి అన్నారు, అయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, దోషులను శిక్షించాలని ఇప్పటికే చెప్పినా ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు? అని శివకుమార్ ప్రశ్నించారు. ఈ విషయంపై మాట్లాడే వారికి సిగ్గు ఉంటే బాధిత కుటుంబీకుల వద్దకు వెళ్లి వారిలో విశ్వాసం నింపి వారికి బలం చేకూర్చేందుకు ప్రయత్నించాలని డీకే అన్నారు.

Next Story