భారత్ లో వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ - 2028

by Muthe.Rajitha |

2028లో జరగనున్న వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ ఆతిథ్య హక్కులను భారత్ సొంతం చేసుకుంది.

భారత్ లో వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ - 2028
X

దిశ, వెబ్ సైట్ : 2028లో జరగనున్న వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ ఆతిథ్య హక్కులను భారత్ సొంతం చేసుకుంది. గురువారం పోలాండ్‌లోని టోరున్‌లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ కౌన్సిల్ సమావేశంలో ప్రెసిడెంట్ సెబాస్టియన్ కో ఈ కీలక ప్రకటన చేసారు. భారత క్రీడా మౌలిక సదుపాయాలపై అంతర్జాతీయ స్థాయిలో ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోంది. గత దశాబ్ద కాలంగా ఒడిశా ప్రభుత్వం క్రీడల పట్ల చూపుతున్న ప్రత్యేక ఆసక్తి, ముఖ్యంగా భువనేశ్వర్‌ను "స్పోర్ట్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా"గా తీర్చిదిద్దడంలో వారు చేసిన కృషికి ఇది దక్కిన అతిపెద్ద గుర్తింపు. జపాన్, ఖతార్ మరియు చైనా వంటి అగ్రదేశాల సరసన ఆసియాలో ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌ను నిర్వహిస్తున్న నాలుగో దేశంగా భారత్ నిలవడం మనందరికీ గర్వకారణం.

భువనేశ్వర్ వేదిక

ఈ మెగా ఈవెంట్‌కు ఒడిశాలోని భువనేశ్వర్ నగరం వేదిక కానుంది. ముఖ్యంగా 2024లో అత్యాధునిక హంగులతో నిర్మితమైన 'కళింగ ఇండోర్ అథ్లెటిక్స్ స్టేడియం' ఈ పోటీలకు ఆతిథ్యమివ్వనుంది. ఇది దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద ఇండోర్ ట్రాక్ సదుపాయం కలిగిన స్టేడియం కావడం గమనార్హం. ఇప్పటికే 2017 ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ మరియు 2023 వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్‌ను అత్యంత విజయవంతంగా నిర్వహించిన భువనేశ్వర్, ఇప్పుడు గ్లోబల్ ఈవెంట్‌ను హోస్ట్ చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంటోంది.

ఆసియాలో నాల్గవ దేశంగా రికార్డు

ఈ ఈవెంట్ ను నిర్వహించడానికి ప్రపంచ దేశాల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ, భారత్ తన మౌలిక సదుపాయాల బలం, క్రీడా నిర్వహణ సామర్థ్యంతో ఈ అవకాశాన్ని దక్కించుకుంది. జపాన్, ఖతార్, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో ఆసియా దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. షెడ్యూల్ ప్రకారం 2026లో ఈ ఛాంపియన్‌షిప్ పోలాండ్‌లో జరగనుండగా, 2028లో భారత్ ఆతిథ్యమిస్తుంది. ఆ తర్వాత 2030లో కజకిస్తాన్ (అస్తానా)లో ఈ క్రీడలు జరగనున్నాయి.

భారత అథ్లెట్లకు భారీ ఊతం

ఈ పరిణామం భారత అథ్లెటిక్స్‌కు కొత్త దిశను చూపించనుంది. సాధారణంగా అంతర్జాతీయ స్థాయిలో ఇండోర్ ఈవెంట్లలో భారత అథ్లెట్ల భాగస్వామ్యం తక్కువగా ఉంటుంది. అయితే, స్వదేశంలోనే ప్రపంచ స్థాయి ట్రాక్ అందుబాటులోకి రావడం, పైగా ప్రపంచ మేటి క్రీడాకారులతో సొంత గడ్డపై తలపడే అవకాశం లభించడం వల్ల మన అథ్లెట్ల ఆత్మవిశ్వాసం రెట్టింపు కానుంది. ముఖ్యంగా 2028 ఒలింపిక్స్‌కు ముందు ఈ ఛాంపియన్‌షిప్ జరగనుండటం భారత క్రీడాకారులకు గొప్ప సన్నాహక వేదికగా మారుతుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story