- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లంచం ఇస్తేనే పని.. లేదంటే పెండింగ్.. శాలిగౌరారంలో అవినీతి అధికారి లీలలు?
ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగంలోని కొందరు అధికారులు అవినీతికి అడ్డాగా మారుతున్నారనే ఆరోపణలకు శాలిగౌరారం మండలం చిత్తలూరు గ్రామంలో జరిగిన ఘటన మరో ఉదాహరణగా నిలిచింది.

దిశ,శాలిగౌరారం: ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగంలోని కొందరు అధికారులు అవినీతికి అడ్డాగా మారుతున్నారనే ఆరోపణలకు శాలిగౌరారం మండలం చిత్తలూరు గ్రామంలో జరిగిన ఘటన మరో ఉదాహరణగా నిలిచింది. సాదాబైనామా చేయించుకోవడానికి వచ్చిన ఓ మహిళా రైతు నుంచి రూ.22 వేల లంచం డిమాండ్ చేసినట్లు గ్రామ జీపీఓ అధికారి పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో రికార్డింగ్ వెలుగులోకి రావడంతో అధికార వర్గాల్లో కలకలం రేగింది. చిత్తలూరు గ్రామానికి చెందిన రైతు సునీత తనకు చెందిన రెండు ఎకరాల రెండు గుంటల భూమికి సాదాబైనామా ప్రక్రియ చేపట్టేందుకు గ్రామ జీపీఓ అధికారి రజితను ఆశ్రయించింది. అయితే నిబంధనల పేరుతో మొదట పని సాధ్యం కాదని చెప్పిన అధికారి, అనంతరం రూ.22 వేలు ఇస్తే పని పూర్తవుతుందని బేరసారాలకు దిగినట్లు బాధితురాలు ఆరోపించింది.
ఈ సందర్భంగా జరిగిన సంభాషణను సునీత రహస్యంగా వీడియోలో రికార్డు చేసింది. వీడియోలో కార్యాలయంలోని ఆర్‌ఐ, డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్ స్థాయి అధికారులకు కూడా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని జీపీవో అధికారి చెప్పినట్లు స్పష్టంగా వినిపిస్తుంది. లంచం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించిన మహిళకు, డబ్బులు ఇస్తేనే ఫైల్ కదులుతుంది.. లేకపోతే పెండింగ్‌లో పడేస్తాం అంటూ హెచ్చరించినట్లు బాధితురాలు ఆరోపించింది. ముందస్తుగా రూ.2 వేల నగదు ఇచ్చిన సమయంలోనే వీడియో రికార్డు చేసినట్లు ఆమె తెలిపింది. అధికారుల వేధింపులతో విసిగిపోయిన సునీత, తన వద్ద ఉన్న వీడియో ఆధారాలను మీడియాకు అందజేసింది. దీంతో ఈ వ్యవహారం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై తహసీల్దార్‌ను వివరణ కోరగా.. విషయం పై నివేదిక సిద్ధం చేస్తున్నామని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.






