- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాగునీటి ప్రాజెక్టులపై ఇరిగేషన్ కమిషనర్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు!
జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆర్ అండ్ ఆర్, ఇరిగేషన్ భూ సేకరణ కమిషనర్ కె.శివ కుమార్ అన్నారు.

దిశ, ఖమ్మం బ్యూరో: జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆర్ అండ్ ఆర్, ఇరిగేషన్ భూ సేకరణ కమిషనర్ కె.శివ కుమార్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్‌తో కలిసి నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, పరిహారం చెల్లింపుల పురోగతిపై ప్రాజెక్టుల వారీగా సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల అమలులో ఉన్న పెండింగ్ అంశాలు వేగవంతంగా పరిష్కరించి భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, మున్నేరు–పాలేరు లింక్ కాలువతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న ఇతర సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిని పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. రైతులకు న్యాయమైన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని, అవార్డుల జారీ, చెల్లింపుల ప్రక్రియలో జాప్యం లేకుండా చూడాలని సూచించారు. ప్రాజెక్టుల అమలులో ఎదురవుతున్న సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించాలని, రెవెన్యూ, నీటిపారుదల శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ తెలిపారు. సమీక్షలో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ జిల్లాలో పురోగతిలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని వివరించారు. జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు సంబంధించి 11 గ్రామాల్లో 193.15 ఎకరాల భూసేకరణ అవార్డు దశలో ఉందన్నారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి 14వ ప్యాకేజీ క్రింద 650.22 ఎకరాల భూసేకరణలో 623.02 ఎకరాలకు అవార్డు పాస్ చేసినట్లు కలెక్టర్ అన్నారు.
15వ ప్యాకేజీకి సంబంధించి 198.13 ఎకరాల భూసేకరణ కు గాను అవార్డు పాస్ చేసి, భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించామన్నారు. ప్యాకేజీ 16కు సంబంధించి 820.12 ఎకరాలకు గాను అవార్డు పాస్ చేసినట్లు, 796.13 ఎకరాలకు పరిహారం చెల్లింపులు పూర్తి చేసి స్వాధీనం చేసుకున్నట్లు, మిగతా భూమికి పరిహారం ప్రభుత్వం నుంచి రావాల్సి ఉన్నట్లు తెలిపారు. ప్యాకేజీ 6, 2, 1లకు సంబంధించి భూసేకరణ పురోగతిలో ఉందన్నారు. భూసేకరణ ప్రక్రియ వేగవంతానికి అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పీ.శ్రీనివాస రెడ్డి, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఇరిగేషన్ సీఈలు ఎం.వెంకటేశ్వర్లు, శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్, ఎస్డీసీ సదానందం, ఇర్రిగేషన్, రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.






