దెయ్యాల ఎముకలు కాదు.. ఏకంగా 1.5 కోట్ల ఏళ్ల నాటి షార్క్ పళ్లు: ఒడిశాలో సంచలన ఆవిష్కరణ!

by Ramesh Naini |

ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లా బారిపడాలో విద్యార్థులు చేపట్టిన ఓ సాధారణ ఫీల్డ్ ట్రిప్ అద్భుతమైన చారిత్రక ఆవిష్కరణకు దారితీసింది.

దెయ్యాల ఎముకలు కాదు.. ఏకంగా 1.5 కోట్ల ఏళ్ల నాటి షార్క్ పళ్లు: ఒడిశాలో సంచలన ఆవిష్కరణ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లా బారిపడాలో విద్యార్థులు చేపట్టిన ఓ సాధారణ విజ్ఞాన యాత్ర (ఫీల్డ్ ట్రిప్) అద్భుతమైన చారిత్రక ఆవిష్కరణకు దారితీసింది. ఈ ప్రాంతంలో సుమారు 1.5 కోట్ల ఏళ్ల నాటి (Miocene epoch) సముద్ర జీవుల శిలాజాలు బయటపడ్డాయి. లక్షల ఏళ్ల క్రితం ఈ ప్రాంతం పూర్తిగా సముద్ర జలాల కింద ఉండేదన్న విషయానికి ఈ శిలాజాలు బలమైన సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

‘అసుర హడ్డా’ గుట్టు రట్టు

నార్త్ ఒరిస్సా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ దేబబ్రత నంది తన విద్యార్థులతో కలిసి ఈ ప్రాంతానికి వెళ్లినప్పుడు కొన్ని వింతైన ఎముకలను గుర్తించారు. స్థానికులు ఏళ్ల తరబడి వీటిని ‘అసుర హడ్డా’ Asura hadda (దెయ్యాల ఎముకలు) అని పిలుస్తుండటం గమనార్హం. వీటిపై లోతుగా అధ్యయనం చేయగా.. అవి దెయ్యాల ఎముకలు కావని, మిలియన్ల ఏళ్ల క్రితం నాటి సూక్ష్మమైన షార్క్ పళ్లు, షార్క్ వెన్నెముక భాగాలు, చేపల ఎముకలు, గవ్వల శిలాజాలు అని తేలింది.

ఒడిశాలో ఒకప్పుడు సముద్రము

ప్రస్తుతం బంగాళాఖాతం తీరం బారిపడాకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ సముద్ర జీవులైన షార్క్ పళ్లు ఇక్కడ లభించడాన్ని బట్టి చూస్తే.. ఒకప్పుడు సముద్ర జలాలు ఇంత భూభాగం లోపలికి విస్తరించి ఉండేవని స్పష్టమవుతోందని డాక్టర్ నంది వివరించారు. కాలక్రమంలో వచ్చిన భౌగోళిక మార్పులు, సముద్ర మట్టాల్లో హెచ్చుతగ్గుల వల్లే సముద్ర తీరం తూర్పు వైపుగా వెనక్కి వెళ్లిపోయి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ అరుదైన ప్రదేశాన్ని ‘జియో-హెరిటేజ్ సైట్’గా అభివృద్ధి చేస్తే పర్యాటకానికే కాకుండా, భవిష్యత్తు పరిశోధనలకు కూడా ఎంతో ఉపయోగపడుతుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story