సికింద్రాబాద్‌లో యువ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

by Jakkula.Mamatha |

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ యువ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు.

సికింద్రాబాద్‌లో యువ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య
X

దిశ, సికింద్రాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ యువ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. గురువారం తెల్లవారుజామున 12:20 గంటల సమయంలో సికింద్రాబాద్–జేమ్స్ స్ట్రీట్ రైల్వే స్టేషన్ల మధ్య కిలోమీటర్ నంబర్ 10/11 వద్ద ఓ వ్యక్తి మృతదేహం పట్టాల పక్కన ఉన్నట్లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డిప్యూటీ స్టేషన్ సూపరింటెండెంట్ సమాచారం అందించారు. దీంతో కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

మృతుడి వద్ద లభించిన సెల్‌ఫోన్ ఆధారంగా అతడిని గుర్తించారు. మృతుడు ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, చింతలూరుకు చెందిన యువకుడిగా తేలింది. గత రెండేళ్లుగా హైదరాబాద్‌లోని గండి మైసమ్మ సమీపంలో నివాసముంటూ టెక్ మహీంద్రా సంస్థలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కుటుంబ సమస్యలు లేదా ఇతర వ్యక్తిగత కారణాలతో మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని షంటింగ్ ట్రాక్ వద్ద పట్టాలపై తల ఉంచి బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మృతుడికి తల్లిదండ్రులు, ఇద్దరు కుమారుల్లో చిన్నవాడిగా కుటుంబ సభ్యులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు.

Next Story