- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ ‘హైబ్రిడ్’ పాలనలో రైతులకు దగా: మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనను గాలికి వదిలేసిందని, రైతులను దగా చేస్తూ ‘రైతు బంధు’ పథకానికి సంబంధించి మరోసారి కొత్త నాటకాలకు తెరలేపిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనను గాలికి వదిలేసిందని, రైతులను దగా చేస్తూ ‘రైతు బంధు’ పథకానికి సంబంధించి మరోసారి కొత్త నాటకాలకు తెరలేపిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్ఐఆర్ పై అవగాహన సదస్సు సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో కేసీఆర్ ప్రభుత్వం రైతును రాజు చేయాలనే సంకల్పంతో 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి, ప్రతి ఎకరానికి నీరందించేలా ప్రణాళికలు అమలు చేసిందని జగదీష్ రెడ్డి గుర్తుచేశారు. ముఖ్యంగా ఆలేరు, భువనగిరి ప్రాంతాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లను తీసుకొచ్చి అద్భుతంగా నీరందించిన ఘనత కేసీఆర్‌దేనన్నారు.
కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ‘రైతు బీమా’, ‘రైతు బంధు’ పథకాలను పూర్తిగా అటకెక్కించిందని, పేరు మార్చి‘రైతు భరోసా’అని పెట్టారు తప్ప క్షేత్రస్థాయిలో రైతులకు ఎలాంటి భరోసా లేకుండా చేశారని మండిపడ్డారు. కన్నెపల్లి పంప్‌హౌస్ బ్రహ్మాండంగా ఉంది. మేడిగడ్డ బారేజ్ అధికారిక స్థితితో సంబంధం లేకుండానే నీళ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా.. ఈ దుర్మార్గపు ప్రభుత్వం కావాలనే కాళేశ్వరం నీళ్లను వాడుకోవడం లేదని ఆరోపించారు. రైతులకు నీరిస్తే పంట ఎక్కువగా పండుతుందని, తాము ఇచ్చిన హామీ ప్రకారం బోనస్ చెల్లించి పంటను కొనుగోలు చేయాల్సి వస్తుందనే నెపంతోనే ఈ ప్రభుత్వం నీటిని విడుదల చేయడం లేదు. ఎన్నికలు వచ్చినప్పుడే ఈ ప్రభుత్వానికి రైతులు గుర్తుకొస్తారని జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. మొన్న పార్లమెంట్ ఎన్నికల ముందు, నిన్న సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల ఓట్ల కోసమే డ్రామాలు ఆడారని విమర్శించారు.
మున్సిపాలిటీల్లో రైతుల ఓట్లు పోతాయనే భయంతో, ఎన్నికలకు ఒక్క రోజు ముందు కేవలం ఒక ఎకరానికి మాత్రమే నిధులు వేసి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఒక అపరిచితుడిలా వ్యవహరిస్తున్నారని, స్వయంగా లక్ష్మీనరసింహ స్వామిని సాక్షిగా పెట్టి దేవుళ్ల మీద ప్రమాణాలు చేసి కూడా ప్రజలను, రైతులను మోసం చేశారు. రుణమాఫీ చేస్తానని ఆ రోజు చేసిన ప్రమాణాన్ని కూడా ఇప్పటివరకు నిలబెట్టుకోలేదు" అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులకు తొత్తులుగా మారుతూ పోలీసు శాఖ మాత్రమే పని చేస్తోందని, అది కూడా చట్టవిరుద్ధంగా నడుస్తోందని జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక పోలీసు అధికారులు అతిగా ప్రవర్తిస్తూ ప్రతిపక్ష నాయకులపై చట్టవ్యతిరేకంగా తప్పుడు కేసులు నమోదు చేయడం, బైండోవర్లు వేయడంపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే రోజుల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులందరిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.






