ఎస్.ఐ.ఆర్ ప్రక్రియపై బీ.ఎల్.ఓలు, సూపర్వైజర్ లకు శిక్షణ తరగతులు

by Taduka Kalyani |

పారదర్శక ఓటరు జాబితా కోసం ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్.ఐ.ఆర్) ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు.

ఎస్.ఐ.ఆర్ ప్రక్రియపై బీ.ఎల్.ఓలు, సూపర్వైజర్ లకు శిక్షణ తరగతులు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ జూన్ 18: పారదర్శక ఓటరు జాబితా కోసం ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్.ఐ.ఆర్) ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఎస్.ఐ.ఆర్ సర్వేను పురస్కరించుకుని నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో గురువారం నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ బూత్ లెవెల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, సహాయ రిటర్నింగ్ అధికారులకు ఎస్.ఐ.ఆర్ సర్వే నిర్వహణ తీరుతెన్నులపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎస్.ఐ.ఆర్ సర్వే ఎలా చేయాలి, ఏయే అంశాలను పరిశీలించాలి, ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, పాటించాల్సిన పద్ధతులపై మాస్టర్ ట్రైనర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి కీలక అంశాలను వివరిస్తూ బీ.ఎల్.ఓలకు దిశానిర్దేశం చేశారు. ఎస్.ఐ.ఆర్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25 నుండి జూలై 24 వరకు బీఎల్ఓ లు ప్రతి ఇంటిని సందర్శిస్తూ ఓటరు మ్యాపింగ్ ను పూర్తి చేయాలని సూచించారు. ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ నిర్వహణలో పాల్గొంటున్న బీ.ఎల్.ఓలకు సర్వే కాలంలో నెల రోజుల పాటు వారివారి శాఖలకు సంబంధించిన దైనందిన విధుల నుంచి మినహాయింపు కల్పించారని కలెక్టర్ తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎస్.ఐ.ఆర్ పైనే పూర్తి స్థాయిలో దృష్టిని కేంద్రీకరిస్తూ, ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా పకడ్బందీగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు. ఓటరు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఓటరు జాబితాలో పేర్లు ఉన్నవారు ఇతర ప్రాంతానికి శాశ్వతంగా వలస వెళ్ళారా, మృతి చెందారా, రెండు చోట్ల పేర్లు ఉన్నాయా అనే అంశాలను నిశితంగా గమనించాలని సూచించారు. ఎస్.ఐ.ఆర్ సర్వే వివరాల ఆధారంగానే ఓటరు జాబితాను రూపొందించనున్న దృష్ట్యా పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా సర్వే జరపాలని హితవు పలికారు. ఎస్.ఐ.ఆర్ ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉండాలని, ఏవైనా సందేహాలు ఉంటే ఏమాత్రం సంకోచించకుండా శిక్షణ తరగతులలో నివృత్తి చేసుకోవాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో ఒక్క ఓటరు కూడా తప్పిపోకుండా చూడాలని, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఇతర వి.ఐ.పీల మ్యాపింగ్ పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓ.టీ.పీని ఇతరులకు తెలుపకుడదని, ఇలా చేయడం నేరంగా పరిగణించబడుతుందని జాగ్రత్తలు సూచించారు.

తప్పిదాలకు తావులేకుండా చిత్తశుద్ధితో నిర్వహించాలి

ప్రతి ఓటరుకు రెండు చొప్పున ఎన్యూమరేషన్ ఫారాలు అందించాలని, వాటిని ఓటరు సరైన విధంగా పూరించారా అన్నది పరిశీలించాలని అన్నారు. పూరించిన ఒక ఫారంను తీసుకుని, మరో ఫారంను ఓటరుకు ఎక్ నాలెడ్జ్ రూపంలో అందించాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే ప్రీ-మ్యాపింగ్ చేసుకున్న ఓటర్లకు సంబంధించి కూడా ఏవైనా మార్పులు చేయాల్సి ఉంటే, వాటిని సరి చేయవచ్చని తెలిపారు. ఒక కుటుంబంలోని ఓటర్లందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు కలిగి ఉండేలా చూడాలన్నారు. అక్టోబర్ 1, 2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తవుతున్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించబడుతుందని, ఈ మేరకు కొత్త ఓటర్లు ఉంటే ఫారం-6 తో పాటు ధృవీకరణ పత్రం తీసుకోవాలని తెలిపారు. ఉపాధి నిమిత్తం విదేశాలలో ఉంటున్న వారి ఎన్యుమరేషన్ ఫారంపై వారి కుటుంబ పెద్ద సంతకం తీసుకోవచ్చని సూచించారు. 01 జూలై 1987కు ముందు జన్మించిన వారు తమ స్వీయ గుర్తింపు లేదా జనన ఆధార పత్రాలు సమర్పిస్తే సరిపోతుందని, తల్లిదండ్రుల పత్రాలు అవసరం లేదన్నారు. 01 జూలై 1987 నుంచి 02 డిసెంబర్ 2004 మధ్య జన్మించిన వారు తమ పత్రాలతో పాటు తల్లి లేదా తండ్రి, తాతయ్య లేదా నానమ్మ ఎవరిదైనా ఒకరి ధ్రువపత్రం సమర్పించాలని, 02 డిసెంబర్ 2004 తర్వాత జన్మించిన వారు స్వీయ ధృవీకరణతో పాటు తల్లిదండ్రులు ఇద్దరి ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుందని సూచించారు. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించబడుతుందని, ముసాయిదా జాబితా అనంతరం ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలు, క్లెయిమ్‌లు, దరఖాస్తులను పరిష్కరించి, అక్టోబర్ 01న తుది ఓటరు జాబితాను ప్రచురించడం జరుగుతుందన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలో బీ.ఎల్.ఓల కృషితో జిల్లాలోనే అత్యధికంగా ప్రీ-మ్యాపింగ్ 93.5 శాతం జరిగిందని, ప్రస్తుత చివరి దశలో ఇదేవిధమైన కృషిని కొనసాగిస్తూ వంద శాతం మ్యాపింగ్ జరిగేలా చొరవ చూపాలని కలెక్టర్ సూచించారు. షెడ్యూల్ మేరకు నిర్ణీత గడువు లోపు ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ పక్కాగా పూర్తయ్యేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని ఈ.ఆర్.ఓలు, ఏ.ఈ.ఆర్.ఓలకు సూచించారు. శిక్షణా తరగతులలో నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, ఏఈఆర్ఓలు, బీ.ఎల్.ఓలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.

Next Story