- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పడమటి అంజన్న రాజగోపురం పనులు ప్రారంభం
మక్తల్ నియోజకవర్గంలో వెలసియున్న అతి పురాతనమైన పడమటి ఆంజనేయస్వామి ఆలయ రాజగోపురం నిర్మాణ పనులు శుక్రవారం ఉదయం వైభవంగా ప్రారంభమయ్యాయి.

దిశ, మక్తల్: మక్తల్ నియోజకవర్గంలో వెలసియున్న అతి పురాతనమైన పడమటి ఆంజనేయస్వామి ఆలయ రాజగోపురం నిర్మాణ పనులు శుక్రవారం ఉదయం వైభవంగా ప్రారంభమయ్యాయి. మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు ఈ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఆలయ రాజగోపుర నిర్మాణం కోసం మంత్రి వాకిటి శ్రీహరి ఇటీవల రూ.70 లక్షల నిధులు మంజూరు చేయించారు. ప్రారంభంలో ఈ గోపురాన్ని 32 ఫీట్ల ఎత్తు, 22 ఫీట్ల వెడల్పు, 16 ఫీట్ల పొడవుతో నిర్మించాలని తలపెట్టారు. అయితే, ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం రాజగోపురం ఎత్తును మరో 10 ఫీట్లు పెంచి, మొత్తం 42 ఫీట్ల ఎత్తులో నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన అదనపు నిధులను కూడా మంజూరు చేయిస్తానని మంత్రి అధికారులకు హామీ ఇచ్చారు. రాబోయే నవంబర్ నెల చివరినాటికి రాజగోపురం పనులన్నీ పూర్తి చేసి, డిసెంబర్‌లో ఘనంగా జరిగే పడమటి ఆంజనేయ స్వామి జాతర (తిరునాళ్ళ) సమయానికి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు.
మంత్రి సంకల్పానికి అనుగుణంగా శుక్రవారం ఉదయం ఆలయ ధర్మకర్త ప్రాణేషాచారి, ఈఓ నిత్యానంద చారిల ఆధ్వర్యంలో నిర్మాణ పనులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాయచూర్ - హైదరాబాద్ జాతీయ రహదారిపై ఈ ఆలయం ఉన్నందున, ఈ మార్గం గుండా వెళ్లే భక్తులకు మరియు ప్రయాణికులకు శ్రీ స్వామి వారి ఆలయం అత్యంత సుందరంగా, భవ్యంగా కనిపించాలనే ఉద్దేశంతో మంత్రి వాకిటి శ్రీహరి తమ కులదైవమైన అంజన్నకు ఈ రాజగోపురాన్ని నిర్మిస్తున్నారు. రాజగోపురం ప్రధాన ద్వార నిర్మాణం కోసం ప్రస్తుతం ఉన్న పాత ద్వారాన్ని తొలగించే పనులను చేపట్టారు. గత కొన్ని వందల సంవత్సరాలుగా ఆ ప్రధాన ద్వారం గుండానే ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకునే అలవాటు ఉన్న స్థానిక భక్తులు, ఆ ద్వారాన్ని తొలగించడం చూసి కాస్త భావోద్వేగానికి గురయ్యారు.






