లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌కు శ్రీకారం

by Ratna Kumari |

లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌కు శ్రీకారం
X

దిశ, షాద్‌నగర్ : దక్షిణ తెలంగాణ రైతాంగం దశాబ్దాల కల అయిన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి భూసేకరణ కోసం తొలి అడుగు పడింది. రంగారెడ్డి - వికారాబాద్ జిల్లాల సరిహద్దులోని లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు నిర్మాణ స్థలంలో రైతులతో జరిగిన సభలో బుధవారం షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిలు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి హామీ మేరకు రూ.10 వేల కోట్ల అంచనా వ్యయంతో 2.88 టీఎంసీల సామర్థ్యం తో లక్ష్మీదేవిపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మిస్తామని ఎమ్మెల్యేలు తెలిపారు. 670 మీటర్ల ఎత్తు నుండి చేవెళ్ల, గండీడ్, వికారాబాద్, పరిగి, తాండూర్, షాద్‌నగర్ ప్రాంతాలకు కాలువల ద్వారా నీరు అందుతుందన్నారు. రైతుల నష్టం తగ్గేలా తక్కువ టీఎంసీలతో ప్రాజెక్టును రీ-డిజైన్ చేశామని స్పష్టం చేశారు. భూసేకరణ కోసం రూ.5-6 వందల కోట్లు చెల్లిస్తామని, భూములు కోల్పోయే రైతులకు సముచిత పరిహారం, పునరావాసం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. వంద మందికి మేలు జరగాలంటే 10 మందికి కొంత నష్టం సహజం. కానీ ఆ నష్టాన్ని తగ్గించడమే మా ధ్యేయం అని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ఎక్కువ భూమి పరిగిలో, అతి తక్కువ భూమి షాద్‌నగర్‌లో ముంపునకు గురవుతుందని తెలిపారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సాధించిన రూ.1,060 కోట్ల పరిగి కాలువను కేసీఆర్ రద్దు చేశారని, లక్షల కోట్లతో కట్టిన కాళేశ్వరం నేడు 'కూలేశ్వరం' అయిందని ఎమ్మెల్యేలు విమర్శించారు. అధికారుల సలహాలు పాటించకుండా అనాలోచితంగా కట్టడం వల్ల రాష్ట్రానికి గుదిబండగా మారిందని దుయ్యబట్టారు. నాగార్జునసాగర్, శ్రీశైలం, నిజాంసాగర్ లాంటి 50 ప్రాజెక్టులను కాంగ్రెస్ నిర్మించిందని, 3-4 ఏళ్లకే కూలిన కాళేశ్వరం వాటితో పోల్చలేమన్నారు. పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తామన్న ప్రధాని మోదీ హామీ నిలబెట్టుకోలేదని విమర్శించారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో కలిసి గత 15 రోజులుగా రాత్రింబవళ్లు అధికారుల చుట్టూ తిరిగి భూసేకరణ ఉత్తర్వులు సాధించామని ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. ల్యాండ్ అక్విజిషన్ ప్రాజెక్టుకు ప్రథమ చర్య అని, మిగతా పనులు వేగంగా జరుగుతాయన్నారు. రైతు బిడ్డ అయిన సీఎం రేవంత్ రెడ్డి రైతులకు అన్యాయం జరగనివ్వరని భరోసా ఇచ్చారు. ప్రజా గాయకుడు గద్దర్ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కోసం నిర్వహించిన సభలో చివరిసారిగా మాట్లాడారని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో రేపు నువ్వు మంత్రివి అవుతావు, దీనికి ఎన్ని పైసలైనా ఇవ్వాలిఅని కోరారని గుర్తుచేసుకున్నారు.

రాజకీయాలకు అతీతంగా ప్రాంతీయ ప్రయోజనాల కోసం కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని రైతులను, ప్రజలను కోరారు. ప్రాజెక్టు పూర్తయి పొలాలకు నీళ్లు పారే వరకు నిద్రపోము అని ఇద్దరు ఎమ్మెల్యేలు శపథం చేశారు. త్వరలో సీఎం, మంత్రులతో కలిసి 30 వేల మందితో బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. 2014లో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టినప్పటి నుండి ఈ ప్రాంత నీటి హక్కుల కోసం పోరాడుతున్నానని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. చనిపోయినా సరే పరిగి కాలువ కట్టి తీరాలి అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశానని గుర్తుచేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేసిందని, ప్రాణహిత-చేవెళ్ల పనులను రద్దుచేసి నీటిని మెదక్‌కు తరలించారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి, వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి, ల్యాండ్ ఆర్ అండ్ ఆర్ కమిషనర్ శివశంకర్ నాయుడు, ఇరిగేషన్ సిఈ ఏఎన్ఎన్ రెడ్డి, షాద్ నగర్ ఆర్డీవో సరిత, జిల్లేడు చౌదరి గూడెం తహసిల్దార్ శ్రీనివాస్, రెండు జిల్లాలకు చెందిన అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story