బడా నిర్మాణ సంస్థల అక్రమాలపై చర్యలు తీసుకోరా..?

by Ratna Kumari |

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ)లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఓ ఫిర్యాదుదారు, కమిషనర్‌ను నేరుగా ప్రశ్నించడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది.

బడా నిర్మాణ సంస్థల అక్రమాలపై చర్యలు తీసుకోరా..?
X

దిశ, మేడ్చల్ బ్యూరో : మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ)లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఓ ఫిర్యాదుదారు, కమిషనర్‌ను నేరుగా ప్రశ్నించడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. అనంతరం పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది ఆయనను సమావేశ మందిరం నుంచి బయటకు తీసుకెళ్లారు. ఫిర్యాదుదారు వి.హరికృష్ణగౌడ్ మాట్లాడుతూ.. కీసర సర్కిల్ పరిధిలోని తూంకుంటలో సుచిరిండియా, వాసవి నిర్మాణ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న వెంచర్‌లో చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఈ అంశంపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డిని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కమిషనర్, ఫిర్యాదుదారును శాంతించాలని కోరగా, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం కమిషనర్ ఆదేశాల మేరకు పోలీసులు, భద్రతా సిబ్బంది హరికృష్ణగౌడ్‌ను ప్రజావాణి హాలు నుంచి బయటకు తీసుకెళ్లారు. తరువాత కమిషనర్ బయటకు వచ్చి ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడి, టౌన్ ప్లానింగ్ అధికారులు సంబంధిత నిర్మాణాలను పరిశీలించి నిబంధనల ఉల్లంఘనలు తేలితే తగిన చర్యలు తీసుకోవాలని చీఫ్ సిటీ ప్లానర్‌కు ఆదేశించారు. హరికృష్ణగౌడ్ తన ఫిర్యాదులో, ఇరిగేషన్ శాఖ గతంలో ఇచ్చిన ఎన్వోసీని రద్దు చేసిందని, హెచ్‌ఎండీఏ కూడా రిజిస్ట్రేషన్లు, నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేసినప్పటికీ పనులు కొనసాగుతున్నాయని ఆరోపించారు.

ప్రజావాణిలో టౌన్ ప్లానింగ్‌పైనే ఎక్కువ ఫిర్యాదులు..

ఎంఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 29 ఫిర్యాదులు అందాయి. వీటిలో 17 ఫిర్యాదులు టౌన్ ప్లానింగ్ విభాగానికి, 10 ఇంజినీరింగ్ విభాగానికి, 2 రెవెన్యూ విభాగానికి సంబంధించినవిగా అధికారులు తెలిపారు. అయితే, టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగాలకు సంబంధించిన ఫిర్యాదులు సకాలంలో పరిష్కారం కాకపోవడం వల్ల అవే అంశాలపై మళ్లీ మళ్లీ ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు.

Next Story