మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలి : వడ్ల మంజుల

by Batti.Sumithra |

మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్ల మంజుల అన్నారు.

మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలి : వడ్ల మంజుల
X

దిశ, చేవెళ్ల: మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్ల మంజుల అన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలో చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల భారత జాతీయ మహిళా సమాఖ్య నిర్మాణ సభలు చేవెళ్ల మండల మహిళా సంఘం అధ్యక్షురాలు లలిత అధ్యక్షతన ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్ల మంజుల మహిళలతో కలిసి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన నిర్మాణ మహాసభలో ఆమె మాట్లాడుతూ మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాగే చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ప్రస్తుతం దేశంలో మహిళలకు సరైన రక్షణ లేకుండా పోయిందని, ఎక్కడ చూసినా మహిళలపై లైంగిక దాడులు, గృహహింస, వరకట్న వేధింపులు, వరకట్న మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలు అమలులో ఉన్నప్పటికీ, మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని అన్నారు. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. "అచ్చే దిన్" అంటే ధరల పై ధరలు పెంచడమేనా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా నాలుగు మండలాల భారత జాతీయ మహిళా సమాఖ్య నూతన కమిటీలను ఎన్నుకున్నారు. చేవెళ్ల మండల అధ్యక్షురాలు, కార్యదర్శులుగా లలిత, వెంకటమ్మలను; మొయినాబాద్ మండల అధ్యక్షురాలు, కార్యదర్శులుగా బాలమణి, యాదమ్మలను; శంకర్‌పల్లి మండల అధ్యక్షురాలు, కార్యదర్శులుగా రాములమ్మ, అమృతలను షాబాద్ మండల అధ్యక్షురాలు, కార్యదర్శులుగా పద్మ, నాగమల్లిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాధవి, యాదమ్మ, జయమ్మ, యశోద, అంజమ్మ, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.

Next Story