మైనర్ల రక్షణలో మహిళా పోలీసులు కీలకం:సీఐ

by Jakkula.Mamatha |

హుజూర్ నగర్ సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహిళా కానిస్టేబుళ్లకు పోక్సో(POCSO) చట్టం పై ప్రత్యేక అవగాహన కలిగి ఉండాలని సీఐ చరమందరాజు అన్నారు.

మైనర్ల రక్షణలో మహిళా పోలీసులు కీలకం:సీఐ
X

దిశ, హుజూర్ నగర్ టౌన్: హుజూర్ నగర్ సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహిళా కానిస్టేబుళ్లకు పోక్సో(POCSO) చట్టం పై ప్రత్యేక అవగాహన కలిగి ఉండాలని సీఐ చరమందరాజు అన్నారు. ఆదివారం హుజూర్‌నగర్ పట్టణంలో నిర్వహించిన అవగాహన సదస్సలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ చరమంద రాజు, ఎస్సై నరేష్ హాజరై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఐ చరమంద రాజు మాట్లాడుతూ.. మైనర్ బాలికల రక్షణలో మహిళా పోలీస్ కానిస్టేబుళ్ల పాత్ర కీలకమని పేర్కొన్నారు. పోక్సో చట్టంలోని నిబంధనలు క్షుణ్ణంగా అవగాహన చేసుకుని, క్షేత్రస్థాయిలో బాలికలకు చట్టాల పై చైతన్యం కల్పించాలని సూచించారు.

ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థినులకు 'పోలీస్ భరోసా' కార్యక్రమం ద్వారా భద్రతా అంశాలు, ఆపదలో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. అంతేకాకుండా.. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలతో మహిళా కానిస్టేబుళ్లు ఎలా వ్యవహరించాలి, బాధితుల ఫిర్యాదులను స్వీకరించేటప్పుడు పాటించాల్సిన మర్యాదపూర్వక పద్ధతులు, జనరల్ డైరీ ఎంట్రీలు నమోదు చేయడం, ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం వంటి అంశాలపై పలు సూచనలు చేశారు. సమాజంలో బాధ్యతాయుతమైన పోలీస్ సిబ్బంది గా పనిచేస్తూ, మహిళలు, బాలికల రక్షణకు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆయన దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story