పవన్ కళ్యాణ్ 'OG' సినిమా చూపిస్తూ మహిళకు బ్రెయిన్ సర్జరీ

by Malleboina Mahesh |   (  Updated:2026-06-06 05:50:28  IST  )

ప్రకాశం జిల్లాకు చెందిన కోటేశ్వరమ్మ అనే మహిళకు మెలకువగా ఉండగానే వైద్యులు బ్రెయిన్ సర్జరీ చేశారు. సర్జరీ సమయంలో 'OG' సినిమా చూపిస్తూ మెదడులోని గడ్డను విజయవంతంగా తొలగించారు.

పవన్ కళ్యాణ్ OG సినిమా చూపిస్తూ మహిళకు బ్రెయిన్ సర్జరీ
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర వైద్య రంగంలో ఒక అరుదైన, అద్భుత ఘట్టం చోటుచేసుకుంది. రోగికి స్పృహ తప్పించకుండా, ఆమె మెలకువగా ఉన్నప్పుడే (Awake Brain Surgery) వైద్యులు అత్యంత క్లిష్టమైన మెదడు శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా దర్శికి చెందిన కోటేశ్వరమ్మ అనే మహిళకు ఈ వినూత్న పద్ధతిలో ఆపరేషన్ చేసి మెదడులోని గడ్డను తొలగించారు. వివరాల్లోకి వెళితే.. కోటేశ్వరమ్మ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.

ఈ క్రమంలోనే ఇటీవల ఆమెకు అకస్మాత్తుగా మూర్ఛ (ఫిట్స్) రావడంతో కింద పడిపోయారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు నిశితంగా పరీక్షలు నిర్వహించి, ఎంఆర్ఐ (MRI) స్కాన్ చేయగా.. మెదడులో ఒక గడ్డ (Brain Tumour) ఉన్నట్లు నిర్ధారించారు. ఆ గడ్డ ఉన్న ప్రాంతం, ఆమె ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆమెకు అనస్థీషియా ఇచ్చి పూర్తిగా స్పృహ తప్పించడం కంటే.. ఆమె మెలకువగా ఉన్నప్పుడే శస్త్రచికిత్స చేసి గడ్డను తొలగించాలని డాక్టర్ల బృందం నిర్ణయించింది.

'OG' సినిమా చూస్తూ సర్జరీ..

ఆపరేషన్ సమయంలో రోగి ఒత్తిడికి గురి కాకుండా ఉండడానికి, ఆమె మెదడు పనితీరును గమనించడానికి వైద్యులు ఒక ఉపాయం ఆలోచించారు. కోటేశ్వరమ్మకు టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానం. దీంతో సర్జరీ థియేటర్‌లో ఆమెకు ఇష్టమైన పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'OG' సినిమాను స్క్రీన్‌పై ప్లే చేశారు. కోటేశ్వరమ్మ ఆ సినిమాను ఆసక్తిగా చూస్తూ వైద్యులతో మాట్లాడుతుండగానే.. డాక్టర్లు ఆమె మెదడులోని గడ్డను విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. ఈ వినూత్న శస్త్రచికిత్సకు సంబంధించిన వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story