నల్లమల గిరిజన ఆశ్రమ పాఠశాలకు సోలార్ వెలుగులు

by Ratna Kumari |

అప్పాపూర్ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలకు ఏస్ ఇంజినీరింగ్ అకాడమీ ఆధ్వర్యంలో 5 కిలోవాట్ సోలార్ పవర్ ప్లాంట్ను శనివారం విరాళంగా అందజేశారు.

నల్లమల గిరిజన ఆశ్రమ పాఠశాలకు సోలార్ వెలుగులు
X

దిశ, అచ్చంపేట : నాగర్‌కర్నూలు జిల్లా లింగాల మండలంలోని నల్లమల అటవీ లోతట్టు ప్రాంతంలో ఉన్న అప్పాపూర్ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలకు ఏస్ ఇంజినీరింగ్ అకాడమీ ఆధ్వర్యంలో 5 కిలోవాట్ సోలార్ పవర్ ప్లాంట్ను శనివారం విరాళంగా అందజేశారు. ఏస్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ వ్యవస్థాపకులు, చైర్మన్ వై.వి. గోపాలకృష్ణమూర్తి ఉదార సహకారంతో ఈ సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో ఎన్‌ఎస్‌ఎస్ యాక్టివిస్ట్, సామాజిక సేవకుడు కేతావత్ పరమేశ్ కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా వైవి.గోపాలకృష్ణమూర్తి మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నత విద్యను అభ్యసించి సమాజానికి ఆదర్శ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో కూడా విద్యార్థుల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

జిల్లా అటవీశాఖ అధికారి (డీఎఫ్‌ఓ) రేవంచంద్ర మాట్లాడుతూ.. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే విద్యే ప్రధాన మార్గమని, ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. డీటీడీఓ కోటాజీ మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల సంక్షేమం, పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషి కొనసాగిస్తామని, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుతో పాఠశాలలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు బోర్‌వెల్ మోటార్, లైటింగ్, ఇతర అవసరాలకు నిరంతర విద్యుత్ అందుబాటులోకి వచ్చిందని అధికారులు తెలిపారు. దీంతో గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం ఏర్పడనుంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు పాఠశాల తరఫున కేతావత్ పరమేశ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌ఓ రేవంచంద్ర (ఐఎఫ్‌ఎస్), డీటీడీఓ కోటాజీ, ఏటీడీఓ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, స్థానిక సర్పంచ్, గ్రామ కార్యదర్శి, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Next Story