ప్లాట్ నాణ్యత తెలియాలంటే.. వర్షా కాలమే బెస్ట్ టెస్ట్

by Sujitha Rachapalli |

సొంత ఇల్లు కావాలంటే ఈ రోజుల్లో లక్షలు కాదు కోట్లలోనే వెచ్చించాలి. అందుకే ఎప్పుడు, ఏ కాలంలో కొనడం మంచిదో కూడా తెలుసుకోవాలి. విలాసవంతమైన భవనం, విశాలమైన గార్డెన్, స్విమ్మింగ్ ఫూల్, లగ్జరీ అపార్ట్‌మెంట్, జిమ్, కారిడార్, మీటింగ్ హాల్.. ఇలా అనేక సదుపాయాలు ఉన్నాయనే ప్రచారాన్ని నమ్మాలా? వద్దా?

ప్లాట్ నాణ్యత తెలియాలంటే.. వర్షా కాలమే బెస్ట్ టెస్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: సొంత ఇల్లు కావాలంటే ఈ రోజుల్లో లక్షలు కాదు కోట్లలోనే వెచ్చించాలి. అందుకే ఎప్పుడు, ఏ కాలంలో కొనడం మంచిదో కూడా తెలుసుకోవాలి. విలాసవంతమైన భవనం, విశాలమైన గార్డెన్, స్విమ్మింగ్ ఫూల్, లగ్జరీ అపార్ట్‌మెంట్, జిమ్, కారిడార్, మీటింగ్ హాల్.. ఇలా అనేక సదుపాయాలు ఉన్నాయనే ప్రచారాన్ని నమ్మాలా? వద్దా? పైగా కొన్న తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అనుమతులు ఉన్నాయని, రెరా నంబర్ కూడా వచ్చిందని చెప్పినా నమ్మే రోజులు కావు ఇవి. మీరు స్వయంగా పరిశీలించడం ద్వారానే నమ్మాలి. బ్రోచర్లు, ఎజెంట్లు చెప్పే ప్రచారాన్ని చూసి ఇల్లు కొనొద్దు. అందమైన బ్రోచర్లను, రంగుల గోడలను చూసి మురిసిపోయి ఇల్లు కొనేస్తున్నారా? అయితే ఇది మీరు తెలుసుకోవాల్సిందే. ఎండా కాలం, చలి కాలంలోనో అపార్ట్‌మెంట్‌ను చూసి కొనొద్దు. మీరు పెట్టే కోట్ల పెట్టుబడికి వర్షా కాలమే అసలైన పరీక్ష అని రియల్ ఎస్టేట్ నిపుణులు సూచిస్తున్నారు. దేశంలో అనేక నగరాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు అసలు రంగును బయటపెడుతున్నాయి. తెలంగాణలోనూ, ప్రధానంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చెరువుల పక్కన నిర్మించిన అపార్ట్‌మెంట్ల పరిస్థితిని కూడా చూస్తూనే ఉన్నారు. అపార్ట్‌మెంట్ల సెల్లార్లు మునిగిపోయాయి. రావిర్యాల చెరువు ఎఫ్టీఎల్‌లో వేసిన లే అవుట్లు నీళ్లల్లో తేలియాడుతున్నాయి. గజానికి వేలల్లో పెట్టి కొనుగోలు చేసిన ప్లాట్ల యజమానులు ఎండాకాలం, చలికాలంలో మాత్రమే వాళ్లు వెళ్లగలరు. వర్షాకాలంలో పడవల్లో వెళ్లాల్సిందే.

ఆందోళన వద్దనుకుంటే..

దేశంలోని మెట్రో నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలో కోట్లు పెట్టి కొనుగోలు చేసిన విలాసవంతమైన గేటెడ్ కమ్యూనిటీలలో సైతం బేస్‌మెంట్లు చెరువులను తలపిస్తున్నాయి. అపార్ట్‌మెంట్లలోకి నీరు చేరడం వంటి దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఓ ప్రముఖ నటి రూ.4 కోట్ల విలువైన ప్లాట్‌లోకి వర్షపు నీరు చేరిన ఉదంతం సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఇల్లు కొనేటప్పుడు వర్షాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణులు సూచిస్తున్నారు.

హైడ్రా దాడి

తాజాగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అనుమతులు ఉన్న ప్రాజెక్టులపైనా రెరా ఎఫ్టీఎల్ పేరిట చర్యలు తీసుకుంటున్నది. మార్ట్ గేజ్ రిలీజ్ చేసే వరకు నిర్మాణం, ప్రాజెక్టు పూర్తయిన తర్వాత కూడా హైడ్రా యాక్షన్ ఉంటుందని గుర్తించాలి. వీటన్నింటి నుంచి తప్పించుకోవాలంటే సొంతిల్లు వర్షాకాలంలోనే కొనడం బెటర్. ఎండా కాలంలో ఎంతటి నాసిరకం బిల్డింగ్ అయినా చాలా అందంగా, పటిష్టంగా కనిపిస్తుంది. కానీ ఒక భారీ వర్షం పడితే చాలు ఆ కట్టడం నాణ్యత ఏంటో, ఆ ప్రాంతంలో మౌలిక వసతులు ఎలా ఉన్నాయో ఇట్టే తెలిసిపోతుంది.

వర్షాకాలమే పక్కా

*సైట్ విజిట్ : వర్షాకాలంలో సైట్ విజిట్ (నివాస పరిశీలన) చేయడం వల్ల లోపాలను గుర్తించవచ్చు. గోడల తేమ, సీపేజ్, నాసిరకం ప్లాస్టరింగ్, సరిగ్గా వాటర్ ప్రూఫింగ్ చేయకపోవడం వల్ల గోడల నుంచి నీరు లీక్ అవ్వడం, పెచ్చులు ఊడిపోవడం వంటివి వర్షాల్లోనే స్పష్టంగా కనిపిస్తాయి. కిటికీల అంచుల నుంచి నీరు లోపలికి వస్తుందా లేదా అనేది గమనించవచ్చు.

* డ్రైనేజీ, మురుగు నీటి వ్యవస్థ : చాలా లగ్జరీ ప్రాజెక్టులలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల భారీ వర్షాలకు బేస్మెంట్లు మునిగిపోతుంటాయి. కార్లు మునిగిపోయే ప్రమాదం ఉందో లేదో ఇప్పుడే తెలుస్తుంది. అపార్ట్‌మెంట్ పరిసరాల్లోని మురుగు కాలువలు వర్షపు నీటిని తట్టుకోగలవా? లేక రోడ్లపైకి నీరు ఉబికి వస్తోందా? అనేది వర్షాకాలంలోనే బయటపడుతుంది.

* లిఫ్ట్, విద్యుత్ అంతరాయాలు: వర్షం పడగానే బేస్‌మెంట్లోకి నీరు చేరి లిఫ్టులు ఆగిపోవడం, జనరేటర్లు పనిచేయకపోవడం వంటి సమస్యలు చాలా సొసైటీలలో తలెత్తుతాయి.

* రోడ్ల పరిస్థితి : అపార్ట్‌మెంట్ బయట కూడా పరిశీలించాలి. ఆ కాలనీ చుట్టుపక్కల రోడ్ల పరిస్థితి ఎలా ఉందో చూడాలి. ప్రధాన రహదారి నుంచి అపార్ట్‌మెంట్‌కు వచ్చే దారిలో మోకాళ్ళ లోతు నీరు నిలుస్తుందా? వర్షం పడితే ఆ ఏరియాలో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతుందా? అత్యవసర సమయంలో అంబులెన్స్ లేదా క్యాబ్ రావడానికి వీలుంటుందా? అనేవి చూడాలి. ఒక రోజు భారీ వర్షం పడినప్పుడు లేదా వర్షం తగ్గిన వెంటనే ఆ ప్రాజెక్టును సందర్శించాలని నిపుణులు సూచిస్తున్నారు. అక్కడ అప్పటికే నివసిస్తున్న ప్లాట్ యజమానులతో మాట్లాడాలని.. వర్షం వస్తే ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? బిల్డర్ సమస్యలను పరిష్కరిస్తాడా? వంటి విషయాలు అడిగి తెలుసుకోవాలని చెబుతున్నారు.

Next Story