- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అరుణాచలంలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఆంధ్రా భక్తుడి మృతి
అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుని ఉండాలన్నది భక్తుల నమ్మకం. కొన్నేళ్లుగా అరుణాచలం గిరిప్రదక్షిణ వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుని ఉండాలన్నది భక్తుల నమ్మకం. కొన్నేళ్లుగా అరుణాచలం గిరిప్రదక్షిణ వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రతిరోజూ వేలాదిమంది భక్తులు 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణ చేసి, అగ్నిలింగేశ్వరుడిని దర్శించుకుంటుంటారు. పౌర్ణమి రోజుల్లో, ప్రత్యేకంగా గురుపౌర్ణమిరోజున ఈ భక్తుల సంఖ్య లక్షల్లోనే ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అంతటి పవిత్రక్షేత్రంలో విషాద ఘటన జరిగింది. తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి ఆలయ గిరి ప్రదక్షిణ మార్గంలో ఉన్న పిళ్లైయార్ గుహ.. దానినే మోక్షమార్గంగా కూడా చెప్తారు. ఆ గుహ గుండా ఎంతటి లావుగా ఉన్నవారైనా ఈజీగా బయటకు వచ్చేస్తారని నమ్మకం. అమ్మ గర్భంలోనుంచి బయటకు వచ్చేందుకు ఎన్ని ఇబ్బందులు పడ్డామో.. ఈ గుహ కూడా అలానే ఉంటుందని చెప్తుంటారు. ఈ మోక్షమార్గంలో చిక్కుకుని ఆంధ్రాకు చెందిన ఓ భక్తుడు మరణించాడు.
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన మణికుమార్ (36) తన కుటుంబ సభ్యులతో అరుణాచలేశ్వరాలయానికి వెళ్లారు. స్వామివారిని దర్శించుకుని గిరి ప్రదక్షిణ మొదలు పెట్టారు. దారిలో ఇడుక్కి పిళ్లైయార్ (మోక్షమార్గం) వద్ద భక్తులు చిన్న గుహలో దూరి బయటకు వస్తుంటారు. కష్టాలు తీరుతాయని నమ్ముతారు. మణికుమార్ కూడా ఆ గుహలో నుంచి బయటికి వచ్చేందుకు ప్రయత్నించగా లోపలే చిక్కుకున్నారు. ఊబకాయం కారణంగా ఊపిరాడక స్పృహ కోల్పోయారు. వెంటనే తోటి భక్తులు అతికష్టంమీద బయటకు తీయగా.. అంబులెన్సులో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ.. అప్పటికే మణికుమార్ చనిపోయాడని వైద్యులు తెలిపారు. దీంతో దైవదర్శనానికి వచ్చి తమ కొడుకుని కోల్పోయామని తల్లిదండ్రులు రోదించారు. ఘటనపై తిరువణ్ణామలై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






