- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్
దేశంలోని ప్రధాన నగరాలతో పోటీ పడుతున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మరో మారు పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. భాగ్యనగరంలో ప్రభుత్వం ఇటీవల ఎన్నో మౌళిక సదుపాయాలతో ప్రాజెక్టుల రూపకల్పనకు శ్రీకారం చుడుతోంది.

దిశ, హైదరాబాద్ బ్యూరో : దేశంలోని ప్రధాన నగరాలతో పోటీ పడుతున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మరో మారు పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. భాగ్యనగరంలో ప్రభుత్వం ఇటీవల ఎన్నో మౌళిక సదుపాయాలతో ప్రాజెక్టుల రూపకల్పనకు శ్రీకారం చుడుతోంది. అందులో భాగంగా ఐటీ కారిడార్లు, డేటా సెంటర్లు, మెట్రో విస్తరణ, ఆర్ఆర్ఆర్, ఫ్యూచర్ సిటీ ఇలా అనేక రకాలుగా అభివృద్ధి పనులకు చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా రవాణా రంగం మెరుగుదలకు తీసుకుంటున్న చర్యలు నగర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. హైదరాబాద్ మెట్రో పాలిటన్ రీజియన్ (హెచ్ఎంఆర్) పరిధిని రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) వరకు విస్తరిస్తుండడంతో నగరంతో పాటు చుట్టూ ఉన్న వికారాబాద్, యాదాద్రి, భువనగిరి, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి తదితర ప్రాంతాలలో గత కొంతకాలంగా స్తబ్దంగా ఉన్న రియల్ ఎస్టేట్ తిరిగి క్రమంగా పుంజుకుంటోంది. మెట్రో రెండవ దశ విస్తరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావడం.. వేగం పుంజుకుంటున్న ఆర్ఆర్ఆర్, కొత్త ఫ్లై ఓవర్లు, మల్టీ లెవల్ జంక్షన్లు, రోడ్ల విస్తరణ వంటి వాటితో గ్లోబల్ కంపెనీలు పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయి. మరో వైపు మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉండడం వంటివి నగరాభివృద్ధికి దోహదం చేసేలా పరిస్థితులు కనబడుతున్నాయి.
పారదర్శకంగా రియల్ ఎస్టేట్
ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆస్తుల మార్కెట్ విలువల సవరణ చేయడంతో పాటు రిజిస్ట్రేషన్ విలువలలో మార్పులు తీసుకువచ్చింది. అంతే కాకుండా బిల్డ్ నౌ వంటి డిజిటల్ వ్యవస్థలను అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వం చేపడుతున్న ఇలాంటి చర్యలతో ఐటీ, ఫార్మా రంగాలతో పాటు డేటా సెంటర్లకు కూడా ప్రధాన కేంద్రంగా మారుతోంది. అమెజాన్, హైపర్ స్కేల్ డేటా సెంటర్ వంటి భారీ పెట్టుబడులకు ముందుకు రావడంతో ఉద్యోగాల అవకాశాలను మరింత విస్తృతం చేస్తోంది. ఇలాంటివి రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత ప్రభావితం చేస్తున్నాయి.
రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం
హైదరాబాద్ నగర రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ఈ ఏడాది మే, జూన్ నెలల్లో నివాస గృహాల రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరిగాయి. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక ప్రకారం.. ఈ ఏడాది జూన్‌లో హైదరాబాద్‌లో మొత్తం 5,560 నివాస గృహాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. జూన్‌లో రిజిస్టర్ అయిన నివాస గృహాల మొత్తం విలువ రూ. 4,148 కోట్లుగా నమోదు కావడం.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం తెలంగాణ ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని రియల్ ఎస్టేట్ వర్గాలు పేర్కొంటున్నాయి.






