ఘోర విషాదం.. 200 అడుగుల ఎత్తు నుండి పడిపోయిన రోప్‌వే ట్రాలీ!

by Malleboina Mahesh |

ఛత్తీస్‌గఢ్‌లో రోప్‌వే ప్రమాదం: కొండపై ఆలయాన్ని దర్శించుకుని వస్తుండగా ట్రాలీ కూలి మహిళ మృతి. ఏడుగురికి తీవ్ర గాయాలు.

ఘోర విషాదం.. 200 అడుగుల ఎత్తు నుండి పడిపోయిన రోప్‌వే ట్రాలీ!
X

దిశ, వెబ్ డెస్క్: అమ్మవారిని దర్శించుకొని కిందకు దిగుతుండగా.. రోప్‌వే ట్రాలీ (Ropeway trolley) 200 అడుగుల ఎత్తు నుండి పడిపోయింది. ఈ ఘోర ప్రమాదం.. ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ జిల్లాలో ప్రసిద్ధ కొండపై చోటు చేసుకుంది. ఆలయ సందర్శన ముగించుకుని భక్తులు రోప్‌వే ట్రాలీలో కిందకు వస్తుండగా ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తింది. ట్రాలీ అదుపు తప్పి వేగంగా కిందకు దూసుకువచ్చి నేలను బలంగా ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ దుర్ఘటనలో ఒక మహిళకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు యాత్రికులు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ప్రమాదం జరిగిన వెంటనే ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రోప్‌వే నిర్వహణలో లోపాలు ఉన్నాయా, కేవలం సాంకేతిక కారణాల వల్లే ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో అధికారులు విచారణ ప్రారంభించారు. పర్యాటక ప్రాంతాల్లో, ఆలయాల్లో ఇటువంటి ప్రమాదాలు జరగడం భక్తుల్లో ఆందోళన కలిగిస్తోంది. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం తరపున ఎక్స్‌గ్రేషియా ప్రకటించే అవకాశం ఉందని స్థానిక వర్గాలు వెల్లడించాయి.

Next Story