- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మురిపించి ముఖం చాటేసిన వరుణుడు.. ఖరీఫ్‌లో వరి సాగు కష్టమే!
ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ప్రధాన ఆధారమైన వర్షాలు ఈసారి ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో వరి సాగుపై తీవ్ర ప్రభావం పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

దిశ,జగదేవపూర్: ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ప్రధాన ఆధారమైన వర్షాలు ఈసారి ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో వరి సాగుపై తీవ్ర ప్రభావం పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీజన్ ప్రారంభంలో ఒకటి రెండు వర్షాలు కురవడంతో రైతులు ఉత్సాహంగా సాగు పనులు ప్రారంభించినా, ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేయడంతో పొలాల్లో తేమ తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని వ్యవసాయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
గతేడాది మండలంలో 10,205 ఎకరాల్లో వరి సాగు చేయగా, ఈ ఏడాది 1000 నుంచి 1500 ఎకరాల్లో వరి సాగు తగ్గనున్నట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. పత్తి 13,305 ఎకరాల్లో, మొక్కజొన్న 98 ఎకరాల్లో,కంది 145 ఎకరాలు, కూరగాయలు 50 ఎకరాల్లో సాగు చేశారు. సాధారణంగా ఈ సమయానికి నారుమళ్లు పూర్తై నాట్లు ఊపందుకోవాల్సి ఉండగా, వర్షాభావంతో అనేక ప్రాంతాల్లో నారుమళ్లు కూడా ఆలస్యమవుతున్నాయి. ఇప్పటికే వరి సాగుకు పొలాలు సిద్ధం చేసుకుందాం అనుకుంటే బోరు బావుల్లో నీరు తగ్గడంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో రైతులు ఉన్నారు.మరోవైపు పత్తి పంటకు కూడా వర్షాభావం ప్రతికూలంగా మారుతోంది. ప్రారంభంలో పడిన వర్షాలకు మొలకెత్తిన పత్తి ప్రస్తుతం తగినంత తేమ లేక ఎదుగుదల మందగిస్తోంది. వర్షాలు మరికొన్ని రోజులు కురవకపోతే పత్తి దిగుబడిపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్తీలు కరిగిపోతున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో చెరువులు, కుంటలు నిండలేదు.
బోర్లు, బావుల్లో నీటి మట్టాలు రోజురోజుకూ తగ్గిపోతుండటంతో భూగర్భ జలాలపై ప్రభావం పడుతుంది.నీటి లభ్యత తగ్గితే వరి సాగును కొనసాగించడం రైతులకు మరింత భారంగా మారే పరిస్థితి నెలకొంది.వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం రైతులు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు. అవసరమైన చోట ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే సాగు విధానాలను పాటించాలని సూచిస్తున్నారు.ఖరీఫ్ సీజన్‌కు ఇంకా కొంత సమయం ఉన్నప్పటికీ, రానున్న రోజుల్లో విస్తారంగా వర్షాలు కురవకపోతే వరి సాగు విస్తీర్ణం తగ్గడంతో పాటు మొత్తం వ్యవసాయ ఉత్పత్తిపై ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు, వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రైతన్నల చూపంతా ఆకాశం వైపే నిలిచింది. వరుణుడు కరుణిస్తేనే ఖరీఫ్ సాగు గాడిన పడుతుందనే ఆశతో రైతులు ఎదురు చూస్తున్నారు.






