ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠాల కంటే.. పక్క వ్యాపారాలకే పెద్దపీట?

by Kodari Anjali |

విద్యాబుద్ధులు నేర్పాల్సిన పంతుళ్లు రియల్ ఎస్టేట్, బీమా రంగాలపై ఆసక్తి పెంచుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠాల కంటే.. పక్క వ్యాపారాలకే పెద్దపీట?
X

దిశ, ఖమ్మం రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించి, వారి భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠశాల బాధ్యతల కంటే పక్క వ్యాపారాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, జీవిత బీమా పాలసీలు, చిట్‌ఫండ్లు, పెట్టుబడి పథకాలు, ఇతర ప్రైవేట్ వ్యాపారాల్లో కొందరు ఉపాధ్యాయులు చురుకుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు స్థానికంగా చర్చకు దారితీశాయి. ప్రభుత్వం ఉపాధ్యాయుల వ్యాపారం ఖమ్మం రూరల్ మండలం తో పాటు ఏదులాపురం మున్సిపాలిటీ పాలేరు నియోజకవర్గం లోని మిగతా మూడు మండలాల్లో కూడా విరీ వ్యాపారం బాగా విస్తరించి ఉందని ఆరోపణలు సైతం బలంగా ఉన్నాయి. ఏ వ్యాపారం ప్రారంభించాలన్న ఉపాధ్యాయులను సంప్రదిస్తే అది 100% సక్సెస్ ఫుల్ గా విజయవంతం అవుతుందని ప్రైవేట్ వ్యాపార వర్గాల చర్చ. జపాన్ దేశానికి చెందిన ఒక వాటర్ డివైస్ " కంగాన్ " అనే పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఆ డివైస్ను విస్తృతంగా వ్యాపారం చేసింది కూడా ఉపాధ్యాయలే, దీనిపై కమిషన్ కూడా భారీ స్థాయిలో ఉపాధ్యాయులకు వస్తుండడంతో తోటి ఉపాధ్యాయులతో పాటు ఇతర ప్రముఖులతోనూ కొనిచ్చే పంతుళ్లు పనిలో నిమగ్నమయ్యారు. గ్రామాల్లో ప్రజలను కలిసే అవకాశాన్ని ఉపయోగించుకుని కొందరు ఉపాధ్యాయులు స్థలాల కొనుగోలు–అమ్మకాలకు మధ్యవర్తిత్వం చేయడం, బీమా పాలసీల కోసం ప్రచారం చేయడం, సెలవు రోజుల్లోనే కాకుండా విధి సమయాల్లో కూడా వ్యక్తిగత వ్యాపారాలకు ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీంతో విద్యార్థుల బోధనపై ప్రభావం పడుతోందని పలువురు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పాఠశాలలపై ప్రభావం?

ఉపాధ్యాయులు సమయపాలన పాటించకపోవడం, తరగతులకు ఆలస్యంగా హాజరు కావడం, విద్యార్థుల సందేహాల నివృత్తికి తగిన సమయం కేటాయించకపోవడం వంటి అంశాలు కొన్ని చోట్ల వినిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తుంటే, కొందరు ఉపాధ్యాయుల నిర్లక్ష్య వైఖరి వల్ల ప్రభుత్వ విద్యపై ప్రజల్లో నమ్మకం దెబ్బతింటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సేవా ధర్మం మరిచిపోతున్నారా?

ఉపాధ్యాయ వృత్తి సమాజంలో అత్యంత గౌరవనీయమైనది. విద్యార్థులకు విజ్ఞానం మాత్రమే కాకుండా విలువలు, క్రమశిక్షణ, బాధ్యతలను నేర్పాల్సిన గురువులే వ్యక్తిగత లాభాల కోసం ఇతర వ్యాపారాల్లో నిమగ్నమవడం సమాజానికి మంచి సంకేతం కాదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

నిబంధనలు ఏమంటున్నాయి?

ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ సేవా నియమావళికి లోబడి ఉండాలి. ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రైవేట్ వ్యాపారాలు నిర్వహించడం లేదా వ్యక్తిగత లాభాపేక్షతో వాణిజ్య కార్యకలాపాల్లో పాల్గొనడం సేవా నియమాలకు విరుద్ధమయ్యే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి ఆరోపణలు ఉంటే సంబంధిత అధికారులు విచారణ జరిపి వాస్తవాలు నిర్ధారించాల్సిన బాధ్యత ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

పర్యవేక్షణ ఎక్కడ?

పాఠశాలలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాల్సిన ఉన్నతాధికారులు ఈ అంశంపై దృష్టి సారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదులు వచ్చినా సమగ్ర విచారణ జరగడం లేదని, దీంతో కొందరు నిర్భయంగా పక్క వ్యాపారాలు కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

తల్లిదండ్రుల డిమాండ్

ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ఈ సమయంలో, విధి నిర్వహణను నిర్లక్ష్యం చేసి ఇతర వ్యాపారాల్లో నిమగ్నమయ్యే ఉపాధ్యాయులపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు కోరుతున్నాయి. విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వ యంత్రాంగం కఠిన పర్యవేక్షణ చేపట్టాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story