హరిత తెలంగాణే లక్ష్యం.. గుర్రంగూడ ఎకో పార్కులో ‘వన మహోత్సవం’ ప్రారంభించిన సీఎం రేవంత్!

by Jakkula.Mamatha |

పర్యావరణ పరిరక్షణ, నగర హరిత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

హరిత తెలంగాణే లక్ష్యం.. గుర్రంగూడ ఎకో పార్కులో ‘వన మహోత్సవం’ ప్రారంభించిన సీఎం రేవంత్!
X

దిశ, హస్తినాపురం: పర్యావరణ పరిరక్షణ, నగర హరిత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గుర్రంగూడ ఫారెస్ట్ ప్రాంతంలో గురువారం నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మొక్క నాటి కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు ఎకో పార్క్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజలకు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం హరిత కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేస్తోందన్నారు. ఈ సందర్భంగా భారీ స్థాయిలో మొక్కల నాటడం చేపట్టగా, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు రిమోట్ కంట్రోల్‌తో పనిచేసే రోబోటిక్ ఏనుగును ఆవిష్కరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హరిత తెలంగాణ లక్ష్య సాధనలో ప్రజల భాగస్వామ్యం కీలకమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ, ఎల్బీనగర్ కాంగ్రెస్ ఇన్‌చార్జి మధు యాష్కీ గౌడ్ ముఖ్యమంత్రికి నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యలు వివరించారు. బీఎన్ రెడ్డి నగర్ ప్రాంతంలో జీవో-118 కారణంగా నెలకొన్న రిజిస్ట్రేషన్ సమస్యలు, కర్మన్‌ఘాట్, బైరమల్‌గూడ, సుల్తాన్‌వాల్వా రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లకు సంబంధించిన ఇబ్బందులు, అలాగే ఓంకార్ నగర్ చౌరస్తా నుంచి గుర్రంగూడ ఫారెస్ట్ వరకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.ఈ అంశాలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు మధు యాష్కీ గౌడ్ తెలిపారు. గుర్రంగూడలో వన మహోత్సవం, ఎకో పార్క్ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన ముఖ్యమంత్రికి, కార్యక్రమానికి హాజరైన మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అలాగే సభను విజయవంతం చేసిన ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు నగర అభివృద్ధిని సమన్వయం చేస్తూ చేపడుతున్న ఈ కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని స్థానికులు అభిప్రాయపడ్డారు.

Next Story