మానవత్వం చూపిస్తే చోరీ చేశారు

by Taduka Kalyani |

మానవత్వం చూపించి లిఫ్ట్ ఇచ్చిన లారీ డ్రైవర్ ను మహిళలు మోసం చేశారు. నగదు తీసుకొని పారిపోయారు.

దిశ, శంషాబాద్: మానవత్వం చూపించి లిఫ్ట్ ఇచ్చిన లారీ డ్రైవర్ ను మహిళలు మోసం చేశారు. నగదు తీసుకొని పారిపోయారు. ఈ ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా అనంతపురం రోడ్ నెం.6కు చెందిన షేక్ బాబావలి లారీ డ్రైవర్. ఈ నెల 17న తన లారీ (AP 39 WM 3786)లో చిత్తూరు జిల్లా పుంగనూరు నుంచి టమాటాలను లోడ్ చేసి హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లికి తీసుకొచ్చి సరుకును దించాడు. అనంతరం జూన్ 18న తిరిగి అనంతపురానికి బయలుదేరాడు. సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో తుక్కుగూడ గ్రామ పరిధికి చేరుకోగానే రోడ్డుపై ఒక మహిళ కింద పడినట్లు కనిపించగా, మరో మహిళ లారీని ఆపాలని కోరింది. దీంతో మానవతా దృక్పథంతో డ్రైవర్ ఇద్దరు మహిళలకు లిఫ్ట్ ఇచ్చాడు. వారు పెద్ద గోల్కొండ టోల్‌గేట్ సమీపంలో లారీ నుంచి దిగిపోయారు. కొద్దిసేపటికే లారీలోని బెడ్‌షీట్‌లో ఉంచిన రూ.38 వేల నగదు కనిపించకపోవడంతో డ్రైవర్ మహిళలను ప్రశ్నించగా, వారు దుర్భాషలాడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె. నరేందర్ రెడ్డి తెలిపారు.

Next Story