ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్.. ఫిట్‌మెంట్‌పై మంత్రి కీలక నిర్ణయం

by Ramesh Naini |

ఆర్టీసీ సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆర్పీఎస్-2021కు సంబంధించిన 11 శాతం ఫిట్‌మెంట్‌ను జూలై 1 నుంచి అమలు చేస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.

ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్.. ఫిట్‌మెంట్‌పై మంత్రి కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీ సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆర్పీఎస్-2021కు సంబంధించిన 11 శాతం ఫిట్‌మెంట్‌ను జూలై 1 నుంచి అమలు చేస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికల అధికారితో చర్చించి సంఘాల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించారు. ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగి శంకర్ కుటుంబానికి ఉద్యోగుల నుంచి సేకరించిన నిధులతో త్వరలో రూ.1 కోటి చెక్కు అందజేయడంతో పాటు కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసే ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు పూర్తయిన సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై గురువారం సచివాలయంలో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉద్యోగుల ప్రమాద బీమా పథకం కింద ఇప్పటివరకు 11 కేసులను పరిష్కరించి ఒక్కో కుటుంబానికి రూ.1 కోటి చొప్పున చెక్కులు అందించినట్లు తెలిపారు. కాలుష్య నియంత్రణ, ఈవీ విధానం, ఎలక్ట్రిక్ బస్సుల విస్తరణపై దక్షిణ భారత రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, కమిషనర్లు, ఆర్టీసీ ఎండీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్టీసీ బస్ స్టేషన్‌ల అభివృద్ధికి అవసరమైన భూ బదలాయింపు ప్రక్రియలను వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.

2815 కొత్త బస్సులు కొన్నాం..

2023-26 మధ్యకాలంలో ప్రజా పాలన ప్రభుత్వం రూ.1,078 కోట్ల వ్యయంతో 2,815 నూతన బస్సులను కొనుగోలు చేసిందని తెలిపారు. ఏటూరు నాగారం, పెద్దపల్లిలో రెండు కొత్త డిపోలను మంజూరు చేసినట్లు వెల్లడించారు. బ్రెడ్ విన్నర్ స్కీమ్, మెడికల్ ఇన్వాలిడేషన్ కింద మొత్తం 1,137 కారుణ్య నియామకాలు చేపట్టినట్లు చెప్పారు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల సీఎస్ఎస్ బకాయిలు రూ.1,096.90 కోట్ల నుంచి రూ.862 కోట్లకు తగ్గాయని, పీఎఫ్ బకాయిలు రూ.2,018.15 కోట్ల నుంచి రూ.1,714.39 కోట్లకు తగ్గాయని తెలిపారు. అలాగే ఎస్ఆర్బీఎస్, ఎస్బీటీ బకాయిలను కూడా రూ.493.02 కోట్ల మేర తగ్గించినట్లు పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న అర్హులైన కారుణ్య నియామకాలను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సర్వీసు నుంచి తొలగించబడిన 490 మంది ఉద్యోగుల్లో ఇప్పటికే 244 మందిని విధుల్లోకి తీసుకున్నామని, మిగిలిన కేసులను త్వరితగతిన పరిశీలించాలని సూచించారు. మహాలక్ష్మీ పథకం మహిళల ఆర్థిక సాధికారతపై చూపుతున్న ప్రభావాన్ని అధ్యయనం చేసి ఫీడ్‌బ్యాక్ నమోదు చేయాలని ఆదేశించారు.

మహిళా సంఘాలను 553 బస్సులకు యజమానులుగా చేసి ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన అందిస్తున్న నేపథ్యంలో వారి అభిప్రాయాలను కూడా సేకరించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,050 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని, అవి ఏ రూట్లలో నడుస్తున్నాయి, లాభదాయక రూట్లు ఏవి, నష్టాలు వస్తున్న మార్గాలు ఏవి అనే అంశాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఈడీలు, ఇతర విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story