అధికారుల పనితీరుపై మెదక్ ఎంపీ సీరియస్....

by Taduka Kalyani |

రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖ అధికారుల పనితీరుపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారుల పనితీరుపై మెదక్ ఎంపీ సీరియస్....
X

దిశ, మిరుదొడ్డి : రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖ అధికారుల పనితీరుపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవలు అందించాల్సిన అధికారులు లంచాలు అడగడం సిగ్గుచేటు అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మల్లుపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఎంపీ రఘునందన్ రావు శంకుస్థాపనలు చేశారు. గ్రామానికి చెందిన కొందరు తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతుందని వాపోయారు. వెంటనే రఘునందన్ రావు సిద్దిపేట ఆర్డిఓ కి ఫోన్ చేసి అధికారుల లంచాల బాగోతాన్ని వివరించి చురకలంటించారు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ల జాప్యం, పౌతీ చేయడానికి 50 వేల లంచం అడగడం ఏంటని ప్రశ్నించారు. అలాంటి అధికారుల పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లేదంటే తానే డబ్బులు అప్పజెప్పి ఏసీబీ అధికారులకు పట్టిస్తానని హెచ్చరించారు. గ్రామాల్లో నూతన సర్పంచులు గ్రామాభివృద్ధి కోసం సిసి రోడ్లు, డ్రైనేజీ పనులు చేయడానికి ముందుకు వస్తే పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదన్నారు. బిజెపి సర్పంచులను ఇబ్బందులకు గురి చేయాలని చూస్తే సహించేది లేదని పంచాయతీరాజ్ శాఖ డిఈ ని హెచ్చరించారు.

Next Story