- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తొలకరి పలకరింపు.. సాగుకు వేసవి దుక్కులు సంసిద్ధం!
తొలకరి పలకరింపుతో అన్నదాత సాగు బడిలో నిమగ్నమవుతున్నారు.

దిశ, మరిపెడ: తొలకరి పలకరింపుతో అన్నదాత సాగు బడిలో నిమగ్నమవుతున్నారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు విస్తారంగా పడతయన్న వాతావరణ శాఖ సూచనలతో రైతులకు ఊరట లభించింది. వేసవి దుక్కులు దున్ని పక్షం రోజులు దాటినా వాన రాకపోవటంతో ఆరుతడి పంటల రైతులు కొంత నైరాశ్యంలో ఉండగా తొలకరి రావటంతో విత్తనాల కొనుగోలుకు పరుగులు పెడుతున్నారు. అదేవిధంగా నీటి సౌలభ్యత ఉన్న రైతులు ఇప్పటికే పచ్చి రొట్ట విత్తనాలు వేసుకోగా.. మరికొంత మంది వరి నారు మళ్లను సైతం సంసిద్ధం చేసుకున్నారు. మరోవైపు ఎల్ నినో పై వాతావరణ శాఖ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హెచ్చరికల నేపథ్యంలో రైతులు ముందు జాగ్రత్త వహించాలని అధికారులు సూచిస్తున్నారు.
వేసవి దుక్కులు సంసిద్ధం..
రోహిణి కార్తె ముగింపులోనే మరిపెడ, కురవి క్లస్టర్ల పరిధిలోని అధిక శాతం రైతులు వేసవి దుక్కులు సిద్ధం చేసుకున్నారు. మరిపెడ క్లస్టర్ పరిధిలో 51 వేల ఎకరాలు, కురవి క్లస్టర్ పరిధిలో 45 వేల ఎకరాల పైన రైతులు పంటల సాగుకు సంసిద్ధం చేసుకున్నారు.అయితే భూసారాన్ని బట్టి పంట ఎంచుకోవాలని, వర్షాధారిత రైతులు తప్పనిసరిగా విత్తనాలు వేసే ముందు అధికారులను సంప్రదించి వారి సూచనలతో పంట వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఎల్‌నినోతో జాగ్రత్త..
పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ప్రతికూల పరిస్థితులతో దేశ వ్యాప్తంగా రానున్న రోజుల్లో ఎల్‌నినో ఎఫెక్ట్ ఉండనుందని వాతవరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండటంతో ఆరుతడి పంటలను అధికశాతం వేసుకోవాలని సూచిస్తున్నాయి. పంట మార్పిడి చేసుకోకుండా సాగు చేస్తే దిగుబడులు తగ్గి రైతుల నష్టపోయే ప్రమాదముందని అధికారులు సూచిస్తున్నారు. రైతులు తప్పనిసరిగా పంట మార్పిడి చేసుకోవాలని, సరిపడా నీటి సౌలభ్యత లేని వారు ఆరు తడి పంటలు మినుము, పెసర, పత్తి వంటి పంటలు వేసుకోవాలని సూచిస్తున్నారు.
కలవర పెడుతున్న బీటి3..
అనుమతి లేని బీటీ-3 పత్తి విత్తనాలు వినియోగం మరోసారి ఆందోళన కలిగిస్తోంది. ఈ విత్తనాల వల్ల దిగుబడులు, పంట నాణ్యత పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ అనుమతి లేని విత్తనాలను కొనుగోలు చేయవద్దని రైతులకు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా కొన్ని గ్రామాల్లో ఖుల్లా మార్కెట్‌లో అనధికారికంగా విత్తనాల విక్రయాలు కొనసాగుతున్నట్లు సమాచారం. అధికారిక రికార్డులు లేకుండా విక్రయాలు జరగడం వల్ల రైతులు మోసపోయే ప్రమాదం ఉందని, గత ఏడాది చాలా మంది రైతులు ఈ విత్తనాలను వేసి నష్టపోయారని అధికారులు వెల్లడించారు. అధికారుల ధ్రువీకరణ లేని, రశీదు లేని ఈ విత్తనాల వల్ల పంట నష్టం వాటిల్లిన ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం అందదని హెచ్చరిస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న వేళ రైతులు అప్రమత్తంగా ఉండి ధృవీకరించిన విక్రయ కేంద్రాల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది.
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు:వీరాసింగ్, ఏవో మరిపెడ
నకిలీ విత్తనాల నివారణకు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తున్నాం. సీడ్స్ ఫెర్టిలైజర్ దుకాణదారులు ప్రభుత్వ నిబంధనలకు లోబడి విక్రయాలు జరపాలి. విత్తన విక్రయాల సమయంలో రైతుకు రశీదు తప్పనిసరిగా ఇవ్వాలి. విత్తనాలకు సంబంధించి స్టాక్ బోర్డు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. రైతులు విత్తనాల కొనుగోలులో జాగ్రత్తలు వహించాలి. దుకాణాల్లో రశీదు తప్పనిసరిగా తీసుకోవాలి. వ్యవసాయ శాఖ అధికారుల వద్ద పంటల నమోదు చేసుకోవాలి. బీటీ 3 విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయకూడదు. బీటి 3తో మానవాళికి శారీరక జబ్బులు వచ్చే ప్రమాదముందని ఏవో వీరాసింగ్ తెలిపారు.






