బడి బాట పట్టిన విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

by Malleboina Mahesh |

బడి బాట పట్టిన విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు. "తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు ఉంది, విద్యార్థులే రేపటి దేశ నిర్మాతలు" అని సందేశం!

బడి బాట పట్టిన విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూతన విద్యా సంవత్సరం (New academic year) ప్రారంభమైంది. వేసవి సెలవుల అనంతరం నేటి నుంచి బడి బాట పట్టిన విద్యార్థులందరికీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పాఠశాలల పునఃప్రారంభాన్ని పురస్కరించుకుని విద్యార్థినీ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఆయన అభినందనలు తెలిపారు. తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు దాగి ఉందని, అందుకే అత్యున్నత ప్రమాణాలతో రాష్ట్రంలో విద్యారంగం విలసిల్లాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనేక విప్లవాత్మక సంస్కరణలు చేపట్టిందని సీఎం గుర్తు చేశారు. విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం వంటి పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించడంతో పాటు విద్యా ప్రమాణాలు పెంచేందుకు తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని ఆయన వివరించారు.

పాఠశాల అనేది కేవలం చదువులు నేర్చుకునే స్థలం మాత్రమే కాదని.. మన వ్యక్తిత్వాన్ని, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే పవిత్ర ఆలయమని ముఖ్యమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. ప్రతి పుస్తకం ఒక కొత్త ప్రపంచానికి తలుపు లాంటిదని, ప్రతి పాఠం ఒక కొత్త అవకాశానికి మార్గమని అన్నారు. "విద్యే గొప్ప సంపద – దానిని ఎవరూ దోచుకోలేరు. విద్యతోనే విజయం, విద్యతోనే వికాసం" అని పేర్కొన్న సీఎం రేవంత్ రెడ్డి.. విద్యార్థులంతా ప్రతి రోజును ఉత్సాహంతో ప్రారంభించి, గురువుల మార్గదర్శకత్వంలో జ్ఞానాన్ని, మంచి విలువలను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. నేటి విద్యార్థులే రేపటి భారతదేశ నిర్మాతలని, తమ కలలను నిజం చేసుకునేందుకు నిరంతరం శ్రమిస్తూ.. కుటుంబానికి, రాష్ట్రానికి, దేశానికి గర్వకారణంగా నిలవాలని సీఎం ఆకాంక్షించారు.

Next Story