తెలంగాణ సెక్రటేరియట్ వద్ద పోస్టర్ల కలకలం.. పోలీసుల అదుపులో మహిళ

by Prasad Jukanti |   (  Updated:2026-06-15 06:55:28  IST  )

తెలంగాణ సచివాలయం వద్ద ఓ మహిళ పోస్టర్లు అతికించడం కలకలం రేపింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణ సెక్రటేరియట్ వద్ద పోస్టర్ల కలకలం.. పోలీసుల అదుపులో మహిళ
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ సెక్రటేరియట్ వద్ద పోస్టర్ల కలకలం రేగింది. ఉచిత పథకాలు వద్దు అంటూ సచివాలయం మీడియా సెంటర్ వద్ద గోడలకు పోస్టర్లు ప్రత్యక్షం అయ్యాయి. ప్రతి‍పేద వాడికి ఇల్లు, యువతకు ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రమ్య పేరుతో చేతి రాతతో రాసి ఉన్న పోస్టర్లు వెలిశాయి. ' మద్యం తాగేవారిని కాదు ఆ మద్యం తయారు చేసే కంపెనీ వారిని పట్టుకోండి. గెలిచేవరకు ఒక మాట గెలిచిన తర్వాత మరో మాట. ఎక్కడో ఇండ్లు ఇచ్చి ఇచ్చామని చెప్పుకోవడం కాదు. అందరికీ ఇచ్చామో లేదో అది చూసుకోండి. సీఎం రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పడం కాదు. తెలంగాణలో ఇల్లు లేని వారు ఉండొద్దు. చదువుకున్నవారికి ఉద్యోగాలు ఇవ్వాలి. నాలుగు కార్లు వేసుకుని తిరగడం కాదు. మీ కాలతో పాదయాత్ర చేయండి అప్పుడే ప్రజల తిప్పలు మీకు అర్థం అవుతుంది.

చేసిన కష్టం ఇంటి కిరాయిలకే:

పల్లెటూర్లో పాదయాత్ర చేసినట్టు కాదు హైదరాబాద్ లో పాద యాత్ర చేయండి. అప్పుడే ఎంత మంది కిరాయికి ఉంటున్నారో మీకు అర్థం అవుతుంది. పల్లెటూరులో ఇల్లు ఇచ్చి పదే పదే చూపించుకోకండి. హైదరాబాద్ లో ఇల్లు ఇచ్చి అందరినీ ఆదుకోండి. చేసిన కష్టం ఇంటి కిరాయిలకే పోతుంటే పిల్లల్ని ఎలా చదివించుకుంటాం. ఎలా బతుకుతాం. బాధలు పడి చదివిన విద్యార్థులకు జాబులు ఇవ్వడం లేదు. ఇవి పిచ్చి గీతలు అనుకోకండి. పేదలు తలచుకుంటే రాజకీయ పార్టీలను గెలిపించాలన్నా పడగొట్టాలన్నా ప్రజల చేతుల్లోనే ఉంది. ప్రజల సమస్యలను పట్టించుకోకుంటే ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్లతారు. అది మీ ఇష్టం. అందుకే తెలగాణను దోచుకోవడం బంద్ చేసి ప్రజలను పట్టించుకోండి. నేను అడిగిన ప్రశ్నలకు త్వరలోనే సమాధానం చెబుతారని అనుకుంటున్నా. ఎన్ని ఏళ్లు అయినా పేదలు పెదవారిగానే, కోటీశ్వర్లు వందల కోట్లు సంపాధిస్తూ మరింత కోటీశ్వరులుగా అవుతున్నాయి. తెలంగాణ సంపద అందరిదీ అని అంబేద్కర్ చెప్పాడు. కానీ ఇప్పుడు కొంత మందితే ఈ సంపద అయిపోయింది. నేను చెప్పిన దాంట్లో ఎదైనా తప్పు ఉంటే క్షమించాలి. లేదంటే నా పేపర్లు అన్ని చించి పారేయండి నా దారిన నేను పోతాను' అంటూ ఈ పోస్టర్లపై రాసి అతికించారు.

పోలీసుల అదుపులో మహిళ:

ఈ పోస్టర్లను గమనించిన సిబ్బంది వాటిని తొలగించారు. అయితే సచివాలయం వంటి హై సెక్యూరిటీ జోన్‌లో పోస్టర్లు అంటించడం చర్చనీయాంశంగా మారింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) సిబ్బంది వెంటనే స్పందించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం ఆమెను సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.





Next Story