క్రూడాయిల్ ధరలు పతనం.. భారీగా పెరిగిన రూపాయి విలువ

by Naga Rani Yarlagadda |

కొద్దిరోజులుగా అమెరికన్ డాలర్ తో బలహీనపడిన రూపాయి విలువ... మళ్లీ పుంజుకుంటోంది. అమెరికా - ఇరాన్ దేశాల శాంతి ఒప్పందం నేపథ్యంలో.. సోమవారం ఉదయం ట్రేడింగ్ లో డాలర్ పై ఏకంగా 58 పైసలు లాభపడింది.

క్రూడాయిల్ ధరలు పతనం.. భారీగా పెరిగిన రూపాయి విలువ
X

దిశ, వెబ్‌డెస్క్: కొద్దిరోజులుగా అమెరికన్ డాలర్ తో బలహీనపడిన రూపాయి విలువ... మళ్లీ పుంజుకుంటోంది. అమెరికా - ఇరాన్ దేశాల శాంతి ఒప్పందం నేపథ్యంలో.. సోమవారం ఉదయం ట్రేడింగ్ లో డాలర్ పై ఏకంగా 58 పైసలు లాభపడింది. ప్రస్తుతం డాలర్ వద్ద రూపాయి విలువ 94.60 కి పెరిగింది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధానికి ముగింపు పలుకుతూ ఒప్పందం కుదిరినట్లు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరలు భారీగా పడిపోయాయి. దీనికి తోడు దేశీయ స్టాక్ మార్కెట్లు బలమైన లాభాలతో ప్రారంభం కావడం, అంతర్జాతీయంగా డాలర్ బలహీనపడటం రూపాయికి మరింత కలిసివచ్చాయని ఫారెక్స్ విశ్లేషకులు పేర్కొన్నారు. ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్లో రూపాయి ట్రేడింగ్ 94.70 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత పుంజుకుని 94.60కి చేరింది. శుక్రవారం నాటి సెషన్లో రూపాయి విలువ 67 పైసలు పెరిగి 95.18 వద్ద ముగిసింది.

107 రోజులపాటు సాగిన యుద్ధానికి ముగింపు పలుకుతూ.. అమెరికా, ఇరాన్ దేశాలు స్విట్జర్లాండ్లో ఫేస్ టు ఫేస్ భేటీ అయి శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో 5వ వంతు వాటా కలిగి ఉన్న కీలక జలసంధి.. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరుస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లపై ఒత్తిడి తగ్గింది. జూన్ 19న ఇరుదేశాలు ఈ శాంతి ఒప్పందంపై స్విట్జర్లాండ్లోనే సంతకాలు చేయనున్నాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 4.66 శాతం పతనమై 83.26 డాలర్లకు చేరింది.

Next Story