- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమ్మతో సమానమైన ప్రజలను నేను కుక్కలతో పోల్చలేదు.. వివాదానికి చెక్ పెడుతూ రాఘవ లారెన్స్ ఎమోషనల్ పోస్ట్
అందరికీ నమస్కారం, నా ఇటీవలి ప్రెస్ మీట్‌కు సంబంధించి నెలకొన్న ఒక అపోహను నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను.

దిశ, సినిమా: కోలీవుడ్ నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించినప్పటి నుంచి పలు వార్తలు వైరల్‌గా మారాయి. అందుకు తన తల్లి అంగీకరించారని.. ప్రజలు డిసైడ్ చేయడమే ఆలస్యమని అన్నారు. అయితే, ఇటీవల మీడియాతో మాట్లాడిన సమయంలో లారెన్స్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీశాయి. సమావేశంలో లారెన్స్ మాట్లాడుతూ.. ఒక కొత్త ఇంటికి మారినప్పుడు ఆ పరిసరాలు, అక్కడి పరిస్థితులు, చివరికి అక్కడ తిరిగే కుక్కల అలవాట్లను అర్థం చేసుకోవడానికి కూడా కొంత సమయం పడుతుందని ఉదాహరణగా చెప్పారు. అదే విధంగా కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి కూడా అక్కడి పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకోవడానికి కొంత సమయం ఇవ్వాలని ఆయన కోరారు. అయితే, ఈ వ్యాఖ్యలను కొందరు తప్పుగా చిత్రీకరిస్తూ, లారెన్స్ ప్రజలను ఉద్దేశించే కుక్కలు అన్నారంటూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించడం ప్రారంభించారు.
ఈ వివాదం ముదరడంతో తాజాగా రాఘవ లారెన్స్ స్పందిస్తూ సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. ‘‘అందరికీ నమస్కారం, నా ఇటీవలి ప్రెస్ మీట్‌కు సంబంధించి నెలకొన్న ఒక అపోహను నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. నా అభిమానులు, ప్రజలు నాకు అమ్మతో సమానమని నేను ఎప్పుడూ చెబుతూనే ఉంటాను. అయితే, నేను ప్రజలను కుక్కలతో పోల్చానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా అసత్యం, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం’’ అని లారెన్స్ పేర్కొన్నారు. కొత్త వాతావరణానికి అలవాటు పడటానికి సమయం పడుతుందనే ఉద్దేశంతోనే తాను ఆ ఉదాహరణ చెప్పానని.. అంతేకానీ తాను ఎంతో గౌరవించే ప్రజలను కుక్కలతో పోల్చేంత కఠిన హృదయుడిని కానని స్పష్టం చేశారు. దయచేసి అందరూ ఆ పూర్తి వీడియోను చూసి, తాను నిజంగా ఏమి చెప్పానో అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. రాఘవ లారెన్స్ ఇంతటితో ఈ వివాదానికి చెక్ పెట్టాలని చూసినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం దీనిపై ఇంకా చర్చలు, విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి.






