మొదటి రోజే 'బోసిపోయిన' బడులు.. అసలు కారణం ఇదేనా!

by Jakkula.Mamatha |

కొత్త విద్యా సంవత్సరం మొదటి రోజే పాఠశాలలపై అమావాస్య ప్రభావం స్పష్టంగా కనిపించింది.

మొదటి రోజే బోసిపోయిన బడులు.. అసలు కారణం ఇదేనా!
X

దిశ, అలంపూర్: కొత్త విద్యా సంవత్సరం మొదటి రోజే పాఠశాలలపై అమావాస్య ప్రభావం స్పష్టంగా కనిపించింది. సెంటిమెంట్ కారణంగా మొదటి రోజు పిల్లలను బడికి పంపేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపలేదు. దీంతో మానవపాడు మండలంలోని పాఠశాలల్లో విద్యార్థుల హాజరు 'సున్నా'గా నమోదైంది. మరోవైపు, చిన్నారి పిల్లలు వెళ్లాల్సిన అంగన్‌వాడీ కేంద్రాలు చాలా చోట్ల మూతపడే ఉన్నాయి. అటు విద్యార్థులు లేక, ఇటు మానవపాడు మండల విద్యాధికారి (MEO) రాక.. ఉపాధ్యాయులు సైతం నామమాత్రంగానే హాజరై అసంతృప్తితో వెనుదిరిగారు. మానవపాడు మండలంలో సోమవారం ప్రారంభమైన పాఠశాలలు మొదటి రోజే వెలవెలబోయాయి.

స్కూల్ బెల్ మోగినా ఒక్క విద్యార్థి కూడా క్లాస్‌రూమ్‌ వైపు కన్నెత్తి చూడలేదు. అమావాస్య సెంటిమెంట్ కారణంగానే తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపలేదని తెలుస్తోంది. పలుచోట్ల అంగన్‌వాడీ కేంద్రాలు అసలు తెరుచుకోనే లేదు. ఇక ఉపాధ్యాయుల హాజరు కూడా నామమాత్రంగానే సాగింది. విద్యాశాఖ ఉన్నతాధికారి (MEO) కూడా ఒక్క పాఠశాలకు విజిట్ చేయకుండా మొదటి రోజు విధులకు హాజరు కాకపోవడం పై ఉపాధ్యాయులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తొలిరోజే విద్యా వ్యవస్థ తీరు ఇలా ఉండటంపై స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. అటు అంగన్‌వాడీలు ఓపెన్ కాలేదు, ఇటు స్కూళ్లలో విద్యార్థులు లేరు. టీచర్లు మాత్రం వచ్చి, నామమాత్రంగా అటెండెన్స్ వేసి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యాశాఖ పర్యవేక్షణ ఇలాగేనా ఉండేది అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Next Story